Global Mrs India International Universe 2023 : ప్రతిష్టాత్మక గ్లోబల్ మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్స్ టైటిల్ 2023ను కర్ణాటక మంగళూరుకు చెందిన షమా వజీద్ గెలుచుకున్నారు. 2024లో జరిగే గ్లోబల్ మిసెస్ యూనివర్స్ పోటీలకు.. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. దిల్లీకి చెందిన గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ పోటీలను నిర్వహించింది.
సుమారు 22 రాష్ట్రాల్లో చేపట్టిన పోటీల్లో వేలాది మంది పాల్గొన్నారు. వీరిలో ప్రధాన పోటీకి మొత్తం 40 మంది ఎంపిక కాగా.. వారికి దిల్లీలో పోటీలు నిర్వహించారు. వీరందరికి 5 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు సంస్థ ప్రతినిధులు. క్యాట్ వాక్, వస్త్రధారణ, నృత్యం, ఒత్తిడిని ఎదుర్కోవడం, శారీరక ఆరోగ్యం ఇలా అనేక రకాల విభాగాల్లో షమా శిక్షణ తీసుకున్నారు. కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించిన షమా.. ఫూల్, టెక్నికల్, టాలెంట్, ఫార్మల్ రౌండ్లలో అదరగొట్టారు. 10 మందిని దాటుకుని చివరకు ప్రథమ స్థానాన్ని సంపాదించారు. షమాకు బాలీవుడ్ నటి మలైకా అరోరా గ్లోబల్ మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్స్ కిరీటాన్ని ప్రదానం చేశారు. ఈ పోటీలకు జడ్జీలుగా 2001 మిసెస్ ఇండియా అదితి గోవిత్రిక, కీర్తి మిశ్రా నారంగ్, అల్లీ శర్మ, ఫిట్నెస్ ట్రైనర్ మనీశా సింగ్, రోహిత్ జేకే వ్యవహరించారు.
'కుటుంబ ప్రోత్సాహం వల్లే సాధ్యం'
గ్లోబల్ మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న షమాకు వివాహం కాగా.. 13 నెలల కుమారుడు ఉన్నాడు. ఆమె ప్రస్తుతం శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్లో పనిచేస్తున్నారు. తన కుటుంబం ప్రోత్సహించడం వల్లే.. తన కుమారుడిని వదిలి ఇది సాధించానని చెప్పుకొచ్చారు షమా వజీద్.
"గ్లోబల్ మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్స్ టైటిల్ 2023 గెలుచుకోవడం సంతోషంగా ఉంది. 2024లో జరిగే గ్లోబల్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాను. టాప్ 10 మధ్య చాలా పోటీ నెలకొంది. మతం అనేది అందరికీ సమానమే. కొందరు ఒక దారిని అనుసరిస్తే.. మరికొందరు వేరే దారిలో పయనిస్తారు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. మనమందరం ఎలాంటి కుల, మత, జాతి వైషమ్యాలు లేకుండా.. ఒకరినొకరు గౌరవించుకోవాలి.
--షమా వజీద్, గ్లోబల్ మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్స్ టైటిల్ 2023 విజేత
తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో కొనసాగేందుకు.. కుటుంబసభ్యులు ఎంతో సహకరించారని చెప్పారు షమా వజీద్. 'మొదట్లో నా కుటుంబసభ్యులు వద్దన్నారు. కానీ ఇప్పుడు అందరి మద్దతు నాకు ఉంది. నా భర్త, తండ్రి, తల్లి నాకు సహాకారం అందించారు. నీకు ఇష్టమైన పని చేయంటూ.. నాకు స్వేచ్ఛను ఇచ్చారు. ఎవరికీ ఇబ్బంది కల్గించకుండా.. నీ రంగంలో దూసుకెళ్లు' అంటూ మద్దతు ఇచ్చారని తెలిపారు షమా వజీద్.
ఇవీ చదవండి : Miss World 2023 పోటీలకు భారత్ ఆతిథ్యం.. 27 ఏళ్ల తర్వాత గ్రాండ్గా!
Miss India 2023 : మిస్ ఇండియా కిరీటం.. ఈ రాజస్థానీ అందానికే సొంతం..!