ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తుంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కమిటీలో సభ్యులు
ఈ ఉన్నత స్థాయి కమిటీలో నిపుణులు, చరిత్రకారులు, రచయితలు, నేతాజీ కుటుంబ సభ్యులు, ఆజాద్ హింద్ ఫౌజ్‌తో సంబంధం ఉన్న ప్రముఖ వ్యక్తులు ఉంటారు. దిల్లీ, కోల్కత్తా సహా నేతాజీకి సంబంధమున్న ఇతర ప్రాంతాల్లో స్మారకోత్సవ కార్యక్రమాలకు ఈ కమిటీ మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ కమిటీ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
"నేతాజీ ధైర్య సాహాసాలు గురించి అందరికీ తెలుసు. ఆయన పండితుడు, సైనికుడు, రాజనీతిజ్ఞుడు. బోస్ 125వ జయంతి వేడుకలను త్వరలో ప్రారంభించబోతున్నాం. దాని కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అందరూ కలిసి ఘనంగా నిర్వహించాలి."
- ప్రధాని నరేంద్ర మోదీ
భారత స్వాతంత్య్ర సంగ్రామానికి నేతాజీ చేసిన విశేష కృషికి నివాళిగా, కృతజ్ఞతకు చిహ్నంగా స్మారకోత్సవం నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చూడండి: 'వైద్య వృత్తి ఎంతో గొప్పది'