తమిళనాడు ప్రత్యేక డీజీపీపై వచ్చిన లైంగిక ఆరోపణలపై దర్యాప్తునకు ఆరుగురు సభ్యులతో 'విశాఖ విచారణ' ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆరుగురు సభ్యులున్న ఈ కమిటీకి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జయశ్రీ రఘునందన్ అధ్యక్షత వహిస్తారని తెలిపింది.
డీజీపీ సీమా అగర్వాల్, ఐజీపీ అరుణ్, డీజీపీ ఛాముండేశ్వరి, డీజీపీ కార్యాలయ ముఖ్య కార్యనిర్వాహక అధికారి వీకే రమేష్ బాబు, అంతర్జాతీయ 'జస్టిస్ మిషన్ ప్రోగ్రాం' నిర్వాహకుడు' లోరెట్టా జోనాలు.. ఈ ప్యానెల్లో ఇతర సభ్యులుగా ఉంటారు.
మహిళలపై లైంగిక వేధింపుల(నివారణ, నిషేధం&పరిష్కార) చట్టం, 2013 నిబంధనల ప్రకారం.. ఈ కమిటీ అవసరమైన చర్యలు చేపడుతుందని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది.
రాజకీయ దుమారం..
ప్రస్తుతం ఈ అంశం తమిళ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని వెంటనే సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు.
మహిళా అధికారిణి ఫిర్యాదుపై ప్రభుత్వం స్పందించట్లేదని డీఎంకే నేత.. లోక్‌సభ సభ్యురాలు కనిమొళి విమర్శించారు. మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ సైతం ఈ అంశంపై స్పందించారు. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
నష్ట నివారణ చర్యలు..
రాజేష్ దాస్‌ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించిన ప్రభుత్వం.. డీజీపీ కార్యాలయంలో 'తప్పనిసరిగా వేచి'(కంపల్సరీ వెయిటింగ్ లిస్ట్) ఉండే జాబితాలో చేర్చింది. ఈ మేరకు అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.కే ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాస్ స్థానంలో కే.జయంత్ మురళి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: జైలులో ఖైదీ హత్యపై హైకోర్టు దిగ్భ్రాంతి