బిహార్ ఫలితాలు కాంగ్రెస్‌ను కుంగదీశాయి. పార్టీ శ్రేణులను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టాయి. బిహార్ ప్రభావం.. కాంగ్రెస్‌పై అన్ని విధాలుగా ఉండనుంది. ఈ పరిణామాలు.. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లోనూ పార్టీని ప్రభావితం చేయనున్నాయి. మహాకూటమిలో భాగంగా నిరాశ కలిగించే ఫలితాలు సాధించి.. కూటమికి అధికారం దూరం కావటానికి కారణమైందన్న వాదనల మధ్య.. డీఎంకే పొత్తు-స్థానాల కేటాయింపుపై పునరాలోచన చేసే అవకాశం కనిపిస్తోంది. ఆర్జేడీలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని డీఎంకే భావిస్తోంది. 2021లో జరగనున్న ఎన్నికల్లో.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న డీఎంకే.. కాంగ్రెస్ కారణంగా ఇబ్బందులు పడొద్దని చూస్తోంది.
గత అనుభవాలు..
అదే సమయంలో 2016 ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటోంది డీఎంకే. నాడు పొత్తులో భాగంగా 41 సీట్లు దక్కించుకున్న హస్తం పార్టీ.. కేవలం 8స్థానాల్లోనే విజయం సాధించి 33స్థానాల్లో ఓటమి పాలైంది. ఇది డీఎంకేకు అధికారం దూరం కావటంలో కీలకంగా నిలిచింది. నాడు అన్నాడీఎంకే-డీఎంకేల మధ్య తేడా 1% మాత్రమే. అంతకుముందు 2011ఎన్నికల్లోనూ 63స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. కేవలం 5సీట్లే దక్కించుకోగలిగింది. ఈ రెండు ఎన్నికల్లోనూ వీరి కూటమి అధికారానికి కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ ప్రస్థానం.. డీఎంకే నాయకులను, కార్యకర్తలను కలవరపెడుతోంది.
ప్రస్తుతం బిహార్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ పతనానికి పరాకాష్టగా మిగిలాయి. డీఎంకే నాయకులు ఈ విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
కాంగ్రెస్ పరిస్థితులను అర్థం చేస్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. బిహార్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ మరోసారి స్వీయ సమీక్ష చేస్కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.
టీకేఎస్ ఎలాంగోవన్, డీఎంకే అధికార ప్రతినిధి
మరో అభిప్రాయం
అయితే, ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు ఒక్కోలా ఉంటాయని.. బిహార్ ఫలితాలు తమిళనాడు కాంగ్రెస్‌పై ప్రభావం చూపకపోవచ్చని మరికొంతమంది నేతలు అంటున్నారు.
ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. తమిళనాడులో కాంగ్రెస్ ఎప్పటిలానే ఉంది. డీఎంకేతో బలమైన బంధం అలానే కొనసాగుతోంది. ఈసారి ప్రజామోదంతో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తాం.
ఉదయనిధి స్టాలిన్, డీఎంకే యూత్ విభాగం
ప్రస్తుతానికి కాంగ్రెస్.. సీట్ల సర్దుబాటులో ఎక్కువ సీట్లు ఆశించే అవకాశం ఉండొచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే నేతలు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించినా తక్కువ స్థానాలే ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని అభ్యర్థిస్తున్నారు. కూటమిలోని ఇతర పార్టీలకు సీట్లు కేటాయించాల్సి ఉన్నందున.. తక్కువ సీట్లకే పరిమితం చేయాలని కోరుతున్నారు.
వివాదాలు -ఇబ్బందులు..
మరోవైపు డీఎంకే-కాంగ్రెస్‌ల మధ్య వివాదాలు పార్టీలను ఇబ్బందిపెడుతున్నాయి. రాజీవ్ గాంధీ హత్యకేసులో నిందుతులుగా ఉన్న 8మందిని విడుదల చేయటం కాంగ్రెస్ బహిరంగంగా ఖండించింది. ఈ పరిణామం డీఎంకేకు రుచించలేదు. అంతకుముందు వీరి విడుదల కోరుతూ డీఎంకే అధినేత గవర్నర్‌కు లేఖ రాస్తే.. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి దీనిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో కూటమిలో ఎటువంటి ఇబ్బందులు లేవంటున్నాయి ఇరుపక్షాలు.
బిహార్ ఫలితాలు తమిళనాడుపై ఎలాంటి ప్రభావం చూపించవు. ఓవైసీ వంటి నేతలు మైనార్టీల ఓట్లు చీల్చారు. కాంగ్రెస్ చాలా చోట్లు తక్కువ తేడాతో ఓటమిపాలయ్యారు. తమిళనాడు.. బిహార్ కాదు. కాంగ్రెస్-డీఎంకేల బంధం గతంలోకంటే బలంగా ఉంది.
గోపన్న, డీఎంకే అధికార ప్రతినిధి
అయితే, జాతీయ స్థాయిలో బలమైన మిత్రపక్షం డీఎంకేకు కావాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకునే అవకాశాలు లేవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ విజయానికి అవసరమైన సీట్లను గెలుచుకోగలదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
మారనున్న పరిస్థితులు..
ఈ నేపథ్యంలో రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలు తగ్గిపోనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కూటమిలోని ఇతర పార్టీలకంటే కాంగ్రెస్ ప్రాధాన్యం తగ్గిపోతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులను అర్థం చేసుకుని, ద్రవిడ పార్టీకి అనుగుణంగా మసులుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటున్నారు పరిశీలకులు. బిహార్ ఫలితాల ప్రభావం తమిళనాడు సీట్లు సర్దుబాటుపై గట్టిగానే పడే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: భాజపా 'సంకీర్ణ' మంత్రం- అన్నాడీఎంకే నిరాక'రణం'