కొవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఉద్దేశించిన కొవిన్ పోర్టల్‌లో(Cowin portal feature) మరో కొత్త సదుపాయాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వ్యక్తుల వ్యాక్సినేషన్ స్థితిని తెలుసుకునే సదుపాయాన్ని ఇతరులకూ కల్పించింది. వ్యక్తి ఫోన్ నంబర్, పేరు ఎంటర్ చేయడం ద్వారా వ్యక్తి మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా వ్యాక్సిన్ స్థితిని తెలుసుకునే వీలును కల్పించినట్లు కేంద్రం పేర్కొంది. ఓటీపీ తెలిపేందుకు వ్యక్తి సమ్మతి అవసరం. ట్రావెల్ ఏజెన్సీలు, ఆఫీసులు, సినిమా థియేటర్లు, ఐటీఆర్‌సీటీసీ వంటి ప్రభుత్వ సంస్థలకు ఈ సదుపాయం ఉపకరించనుంది.
వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేని సందర్భంలో ఇటు వ్యక్తులకు, అటు సర్వీసు ప్రొవైడర్లకూ ఈ సదుపాయం ఉపకరించనుంది. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులకు మాత్రమే ప్రయాణానికి అనుమతించాలని ట్రావెల్ సంస్థలు నిర్ణయించినప్పుడు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.
అలాగే, ఉద్యోగి వ్యాక్సినేషన్ స్థితిని సంస్థలు కూడా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కొంది. అలాగే, పూర్తిగా లేదా పాక్షికంగా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఉండే బ్యాడ్జ్‌ను సైతం కొవిన్ పోర్టల్‌లో(Cowin portal) పొందొచ్చని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. ఈ బ్యాడ్జ్‌ను స్నేహితులు, సోషల్ మీడియా వేదికగా పంచుకోవచ్చని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: దేశంలోనే తొలిసారి.. తమిళనాడులో 'డీఎన్ఏ సెర్చ్ టూల్'