కర్ణాటక చామరాజనగర్లో అతిథుల మధ్య కోలాహలంగా జరిగిన ఇద్దర మహిళల సీమంత కార్యక్రమం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే వారిద్దరూ లైంగిక దాడికి గురయ్యారు. అయితేనేం అటువంటి వారిని చేరదీసి సంప్రదాయబద్దంగా జరగాల్సిన కార్యక్రమాన్ని జరిపించింది స్పందన స్వధార కేంద్రం.
స్పందన స్వధార కేంద్రం.. ఓ వరం..
దివ్యాంగురాలైన ఒక మహిళ, 17 ఏళ్ల మరో యువతి స్పందన స్వధార కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిద్దరూ ఏడు నెలల గర్భిణీలు. దివ్యాంగురాలైన మహిళ.. ఇంటి యజమాని చేతిలో లైంగిక దాడికి గురవ్వగా.. 17ఏళ్ల బాలిక చిన్నతనంలోనే ప్రియుడి చేతిలో మోసపోయింది. లైంగిక హింసకు గురై, ఆదరణ కరవైన ఎందరో మహిళలను చేరదీసి.. జీవితంపై భరోసా కల్పిస్తోంది స్పందన స్వధార కేంద్రం. గుండెల్ని మెలిపెట్టే బాధలో ఉన్న వారికి సరికొత్త జీవితాన్ని అందిస్తోంది.
కర్ణాటకలో మహిళలపై నేరాలు తీవ్రంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా 18-29 ఏళ్ల వయసున్న వారిపై నేరాలు 11 శాతం పెరిగాయి. తమ భర్తల చేతిలో హింసకు గురవుతున్న మహిళల సంఖ్య సైతం అమాంతంగా పెరిగిపోతోంది.
కర్ణాటకలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లైంగిక హింస పెరిగిపోతోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) వెల్లడించింది. ముఖ్యంగా 18-49 ఏళ్ల వయసున్న మహిళల్లో 20.6 శాతం మంది తమ భాగస్వామి చేతిలో లైంగిక హింసకు గురవుతున్నారని 2015-16 ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేలో తేలగా.. ఇది 2019-20 నాటికి 44.4 శాతానికి పెరిగిందని పేర్కొంది.
ఇదీ చదవండి: 'అందులో సిగ్గుపడాల్సింది ఏముంది?'