Monkeypox Advisory: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న వేళ వ్యాధి విస్తరించకుండా ప్రజలు ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరిస్తూ కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. మంకీపాక్స్ బాధితులను తాకినా, దగ్గరగా ఉన్నా వ్యాధి సోకే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాబట్టి వ్యాధి సోకిన బాధితులను ఇతరులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచాలని కోరింది. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంతవరకు.. బాధితులను ఐసోలేషన్‌లోనే ఉంచాలని సూచించింది.
Monkeypox Dos And Donts: మంకీపాక్స్ బాధితులు మూడు లేయర్ల మాస్క్ ధరించాలని దద్దుర్లు బయటి గాలికి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులనే వేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. బాధితులకు సమీపంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలని ప్రజలకు సూచించింది. ఆ తర్వాత చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని స్పష్టంచేసింది. మంకీపాక్స్ బాధితులు ఉన్న ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది.
'బాధితులపై వివక్ష చూపకూడదు'.. మంకీపాక్స్ బాధితులు ఉపయోగించే దుస్తులు, వాడే టవళ్లు, పడుకునే మంచాన్ని కుటుంబంలో ఇతరులు వాడకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగిలిన కుటుంబ సభ్యుల దుస్తులతో కాకుండా ప్రత్యేకంగా శుభ్రం చేయాలని సూచించింది. మంకీపాక్స్ లక్షణాలు కన్పిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదని కోరింది. తప్పుడు సమాచారం నమ్మి.. బాధితులపై వివక్ష చూపరాదని కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు జారీచేసింది.
'యూఏఈ నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా'.. దేశంలో నమోదైన మంకీపాక్స్ కేసుల్లో యూఏఈ నుంచి భారత్ వచ్చిన వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న వారు.. విమాన ప్రయాణం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యూఏఈలోని ప్రపంచ ఆరోగ్యశాఖ ప్రతినిధులను కోరింది. ఈ మేరకు.. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ లేఖ రాశారు. అరబ్ ఏమిరేట్స్ నుంచి భారత్‌కు వచ్చిన కొందరిలో మంకీపాక్స్ నిర్దరణ అయిన విషయాన్ని యూఏఈలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులకు గుర్తుచేశారు. మంకీపాక్స్ వ్యాధి విస్తరించకుండా విమాన ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలను ముమ్మరం చేయాలని కోరారు.
ఇవీ చదవండి: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం