కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ముందు మరోసారి దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా మినహా.. దేశవ్యాప్తంగా ఈ నెల 8న మలివిడత టీకా డ్రై రన్ చేపట్టనున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. యూపీలో ఇటీవలే డ్రై రన్ నిర్వహించగా.. హరియాణాలో జనవరి 7న(గురువారం) జరగనుంది.
కేంద్ర మంత్రి భేటీ..
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులతో బుధవారం సమావేశమై మార్గనిర్దేశం చేయనున్నారు. కరోనా టీకా వినియోగం దృష్ట్యా రాష్ట్ర పరిస్థితులపై చర్చించనున్నారు మంత్రి. అంతేకాకుండా దేశంలో బర్డ్‌ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. దాని నియంత్రణకు ముందస్తు చర్యలపైనా సమీక్ష నిర్వహించనున్నారు.
దేశంలో మొత్తం 700కుపైగా జిల్లాల్లో ఈ నెల 8న డ్రైన్ రన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే సంబంధిత ప్రణాళికలన్నింటినీ సిద్ధం చేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో భాగంగా ప్రతిజిల్లాలో మూడు సెషన్లను ఏర్పాటు చేయనున్నారు. గతంలో లాగానే ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు ఇందుకు వేదిక కానున్నాయి. గతవారం(జనవరి 2న) చేపట్టిన తొలిదశ డ్రైరన్‌ను మొత్తం 125 జిల్లాల్లో నిర్వహించారు అధికారులు.
6.6 కోట్ల టీకా డోసులు..
దేశంలో తొలి దశ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా.. ఆరోగ్య సిబ్బంది, కరోనా యోధులకు టీకా అందించేందుకు.. సుమారు 6.6 కోట్లు డోసులు వ్యాక్సిన్ అవసరమవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బఫర్ స్టాక్ సహా మొత్తం 6కోట్ల మందికి టీకా అవసరం కానుంది. ఆక్స్పర్డ్-ఆస్ట్రాజెనెకా- కొవిషీల్డ్, భారత్ బయోటెక్- కొవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఇటీవలే ఆమోదం లభించిన నేపథ్యంలో.. టీకా అందించేందుకు ఈ విధమైన సన్నాహాలు చేస్తోంది కేంద్రం. ఈ నెల 13 నుంచి వ్యాక్సిన్ డ్రై రన్ చేపట్టనున్నట్టు ప్రకటించింది ఆరోగ్యశాఖ.
ఇదీ చదవండి: ఈవీఎంల రద్దు పిటిషన్ తిరస్కరణ