భారత్ బయోటెక్ చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ (Covaxin Children) కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు విషయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. 2-18 ఏళ్ల మధ్య వయసు వారికి ఇచ్చే ఈ టీకాకు (Covaxin Vaccine) అత్యవసర అనుమతులు (Covaxin approval news) జారీ చేయాలని సూచించింది. కొన్ని షరతుల మేరకు ఈ టీకా వినియోగించవచ్చని కమిటీ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్.. 2-18 ఏళ్ల మధ్య పిల్లల కోసం కొవిడ్ టీకాను అభివృద్ధి చేసింది. రెండు, మూడు దశల ట్రయల్స్ (Covaxin children trial) సైతం పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన డేటాను కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థకు సమర్పించింది. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఈ నెల మొదట్లో దరఖాస్తు చేసుకుంది.
దీనిపై విషయ నిపుణుల కమిటీ విస్తృతంగా చర్చలు జరిపింది. అనంతరం, పరిమిత వినియోగం కోసం చిన్నారుల టీకాకు అనుమతులు జారీ చేయవచ్చని డీసీజీఐకి సిఫార్సు చేసిందని ఆయా వర్గాలు వెల్లడించాయి. డీసీజీఐ తుది అనుమతులు ఇస్తే.. దేశంలో చిన్నారులకు కరోనా టీకా అందుబాటులోకి వస్తుంది. అనుమతుల తర్వాత మార్కెట్లోకి వస్తే.. కరోనాకు వ్యతిరేకంగా అందుబాటులోకి వచ్చిన తొలి దేశీయ చిన్నారుల టీకాగా రికార్డుకెక్కనుంది.
ఇదీ చదవండి: