Justice Pardiwala Social Media: దేశంలో న్యాయమూర్తులు, వారి తీర్పులను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత దాడులకు ప్రయత్నించడం ప్రమాదకరమైన పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పర్దీవాలా ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రక్షించుకోవాలంటే డిజిటల్, సోషల్ మీడియాలను తప్పనిసరిగా నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేదికలపై లక్ష్మణరేఖ దాటుతూ న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగతంగా, దురుద్దేశంతో దాడులకు పాల్పడడం ప్రమాదకరమన్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలన్న సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ జేబీ పర్దీవాలా.. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
'న్యాయమూర్తులు, వారి తీర్పులకు వ్యతిరేకంగా దాడులకు ప్రయత్నించడం ప్రమాదకర పరిణామం. చట్టప్రకారం ఏం తీర్పు ఇవ్వాలో అనే విషయం కంటే మీడియా ఏ కోణంలో చూస్తుందనే విషయంపైనే న్యాయమూర్తులు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి రావడం దురదృష్టకరం' అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పర్దీవాలా పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజాభిప్రాయ ప్రభావం ప్రతిబింబించేలా తీర్పు ఉండకూడదని.. కచ్చితంగా అది చట్టప్రకారమే ఉండాలని ఉద్ఘాటించారు. ఇక డిజిటల్, సోషల్ మీడియాలపై మాట్లాడిన ఆయన.. ఇవి కేవలం సగం వాస్తవాలను మాత్రమే కలిగి ఉండి, న్యాయప్రక్రియలో పరిశోధనలు మొదలు పెడతాయని అన్నారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు కేవలం తీర్పుల ద్వారానే మాట్లాడాలని.. సోషల్ మీడియా వేదికల్లో మాట్లాడకూడదని జడ్జీలకు సూచించారు.
ఇదిలా ఉంటే, మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సర్వోన్నత న్యాయస్థానం కొద్దిరోజుల కిందట తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు ఆమే ఏకైక బాధ్యురాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో మీడియా వేదికగా దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణ చెప్పాలని సుప్రీం న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: నిద్రమాత్రలు ఇచ్చి.. భర్తను చికెన్ బర్నర్లో కాల్చిన మహిళ
సీఎం ఇంట్లోకి ఆగంతుకుడు.. అర్ధరాత్రి గోడ ఎక్కి.. రాత్రంతా...
కెమిస్ట్ హత్య.. స్నేహితులదే కుట్ర.. ఆ ఎన్జీఓ కేంద్రంగానే అంతా.. దర్యాప్తు వేగవంతం!