12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. గ్రేడ్లు నిర్ణయించే ప్రక్రియ వివరాలను రెండు వారాల్లోగా వెల్లడించాలని సీబీఎస్ఈ, సీఐసీఎస్ఈని ఆదేశించింది.
కరోనా సంక్షోభం కారణంగా 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం. దేశ, విదేశాల్లో అడ్మిషన్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన నేపథ్యంలో.. రెండు వారాలకు మించి సమయం ఇవ్వబోమని స్పష్టం చేసింది. పరీక్షలను రద్దు చేయడం ఎంత ముఖ్యమో.. గ్రేడ్లు కేటాయించే ప్రక్రియ కూడా అంతే ముఖ్యమని పేర్కొంది. గ్రేడ్ల కోసం పరిగణించిన అంశాలను స్వయంగా పరిశీలిస్తామని వెల్లడించింది.
ఈ సందర్భంగా.. పలు రాష్ట్రాల బోర్డులు ఇంకా పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ మమతా శర్మ పేర్కొన్నారు. పరీక్షలు రద్దు చేయాలని ఆయా బోర్డులకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ వ్యవహారంలో దూకుడుగా ఉండొద్దని, కొంత సహనంతో ఉండాలని కోర్టు మమతకు సూచించింది.
అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.
'రెండు వారాలు పడుతుంది..'
12వ తరగతి విద్యార్థుల గ్రేడ్ల వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్టు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి వెల్లడించారు. సాధ్యాసాధ్యాలపై నిపుణులు చర్చించి రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- ఎగ్జామ్స్: సీబీఎస్ఈ బాటలోనే ఆ రాష్ట్రాలు!