క్రిమినల్ కేసుల విచారణకు రూపొందిన కొత్త ముసాయిదా నిబంధనల (డ్రాఫ్ట్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రాక్టీస్-2021)ను అమల్లోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు మంగళవారం అన్ని హైకోర్టులను ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతమున్న నిబంధనలు, నోటిఫికేషన్లు, ఉత్తర్వులను మార్చాలని స్పష్టంచేసింది. ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తికావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 'ఈ దిశగా సంబంధిత శాఖల ఆమోదం, ముసాయిదా నిబంధనలపై లాంఛన నోటిఫికేషన్ జారీ వంటివాటిని ఆరు నెలల్లోగా పూర్తి చేయాలి' అని నిర్దేశించింది.
ఈ ముసాయిదా నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థల కోసం పోలీసు, ఇతర మాన్యువల్స్‌కు ఆరు నెలల్లోగా సవరణలు చేయాలని పేర్కొంది. ముఖ్యంగా.. ముసాయిదా నిబంధనలు 1-3కి సంబంధించి ఈ ఆదేశం నిర్దిష్టంగా వర్తిస్తుందని తెలిపింది. కోర్టులు.. క్రిమినల్ కేసుల విచారణకు ముందు ప్రాథమికంగా కేసు నిర్వహణపై విచారణ జరపాలని స్పష్టంచేసింది. 'అభియోగాలు నమోదు చేసిన వెంటనే దీన్ని చేపట్టవచ్చు. ఈ విచారణలో.. న్యాయస్థానాలు మొత్తం సాక్ష్యాధారాల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలి. వారిని ప్రత్యక్ష సాక్షులు, వస్తు రూపంలో ఉండే సాక్ష్యాలు, లాంఛన సాక్షులు (వీరు సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది), నిపుణులుగా వర్గీకరించాల్సి ఉంటుంది' అని ధర్మాసనం తెలిపింది.
తాజా ముసాయిదా నిబంధనల్లో శవపరీక్ష నివేదిక, అభియోగాలు, విచారణ, ఆధారాల నమోదు వంటి అనేక అంశాల ప్రస్తావన ఉంది. వీటి ప్రకారం.. మెడికో లీగల్ సర్టిఫికేట్, పోస్ట్ మార్టమ్ నివేదికల్లో మానవ శరీరాన్ని ముద్రించాల్సి ఉంటుంది. బాధితుడికి అయిన గాయాలు వంటివాటిని అందులో ప్రస్తావించాలి. దేశంలో క్రిమినల్ నేరాల విచారణల్లో లోపాల అంశాన్ని 2017లో సుప్రీం కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దానిపై ఇప్పుడు తాజా ఆదేశాలిచ్చింది.
22 నుంచి అత్యవసర కేసులపైనే విచారణ
దేశంలో కొవిడ్-19 ఉద్ధృతి నేపథ్యంలో ఈ నెల 22 నుంచి అత్యవసర కేసులపై మాత్రమే విచారణ చేపడతామని సుప్రీం కోర్టు మంగళవారం ప్రకటించింది. ఆ రోజు కోసం ఇప్పటికే లిస్టు అయిన కేసుల విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తక్షణం విచారణ చేపట్టాలని భావించిన కేసుల వివరాలను న్యాయవాదులు, కక్షిదారులు ఈమెయిల్ ద్వారా మాత్రమే కోర్టుకు పంపాలని స్పష్టంచేసింది.
ఇదీ చూడండి: సుప్రీంకోర్టులో కేసుల విచారణపై కరోనా ప్రభావం