దేశంలో రాజకీయ దుమారానికి కారణమైన పెగసస్ నిఘా వ్యవహారంపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులపై నిఘా పెట్టడానికి పెగసస్‌ను ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
" విచారణ ప్రారంభించేందుకు ముందు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. పెగసస్‌పై వస్తోన్న వార్తలు నిజమైతే.. ఆరోపణలు చాలా తీవ్రమైనవనటంలో ఎలాంటి సందేహం లేదు. 2019లోనే పెగసస్ వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత సమాచారం పొందే ప్రయత్నం జరిగిందా? అనేది తెలియదు. కొందరు తమ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని చెబితే.. అది టెలిగ్రాఫ్ చట్టం కిందకు వస్తుంది. ఆ ప్రకారమే ఫిర్యాదులు చేయాలి."
- ధర్మాసనం.
ప్రముఖ పాత్రికేయులు ఎన్.రామ్ సహా ఇతరు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు సిబల్. చాలా వరకు సమాచారం పొందే వీలులేదన్నారు. ఫోన్లలోకి నేరుగా ప్రవేసించిన 10 కేసులకు సంబంధించిన సమాచారం ఉందని తెలిపారు.
ప్రముఖ పాత్రికేయులు ఎన్.రామ్ సహా ఇతరు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. పెగసస్ అనే చెడు సాంకేతికత మా జీవితాల్లోకి మాకే తెలియకుండా ప్రవేశించిందని కోర్టుకు తెలిపారు. అది గోప్యత, గౌరవం, గణతంత్ర విలువలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఈ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకే విక్రయించారని, ప్రైవేటు సంస్థలకు కాదని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో ఎన్ఎస్ఓ పాత్ర ఉందని తెలిపారు. ఈ స్పైవేర్‌ను ఎవరు కొనుగోలు చేశారు? దాని హార్డ్‌వేర్ ఎక్కడ పెట్టారు? ఈ కేసులో ప్రభుత్వం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? అనే అంశాలపై ప్రభుత్వం సమాధానమివ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించేలా.. కేంద్రానికి నోటీసులు ఇవ్వాలని సీజేఐని కోరారు సిబల్.
వాదనల అనంతరం.. వ్యాజ్యాల కాపీలను కేంద్రానికి అందించాలని పిటిషనర్లకు సూచించింది ధర్మానసనం. అనంతరం.. విచారణను మంగళవారం (ఆగస్టు 10)కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'పెగసస్' దుర్వినియోగంపై చర్యలు- ఆ దేశాలపై నిషేధం!