సామాజిక వంటశాలల (Community Kitchens In India) ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ఏకరూప విధానాన్ని రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం పట్ల భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటిపై ఉమ్మడి పథకం రూపొందించడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని.. వీలైనంత త్వరలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. దేశంలో కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రజలు ఆకలితో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో వారికి ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించి మూడువారాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని.. లేదంటే తామే ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది.
ఇదే చివరి హెచ్చరిక..
ఆకలితో అలమటిస్తోన్న వారికి ఆహారం అందించేందుకు దేశవ్యాప్తంగా సామాజిక వంటశాలలు (Community Kitchens In India) ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాంటూ దాఖలైన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన 17 పేజీల అఫిడవిట్‌పై చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో కేవలం సమాచారం మాత్రమే ఉందని.. పథకం రూపకల్పనకు సంబంధించిన విషయాలేవీ లేవని పేర్కొన్నారు. కేవలం పోలీసుల మాదిరిగా సమాచారం సేకరించడం కాదని.. పథకం అమలుపై రాష్ట్రాలతో చర్చించాలని కేంద్రానికి చురకలంటించారు. మేము అడిగిన దానికి.. మీరు ఇచ్చిన సమాచారానికి పొంతన లేదన్న చీఫ్ జస్టిస్.. ఇదే మీకు చివరి హెచ్చరిక అని కేంద్రానికి స్పష్టం చేశారు.
ఆకలితో చనిపోతున్న వారికి ఆహారం ఇవ్వాల్సిందే..
'ఆకలితో చనిపోతున్న ప్రజలకు ఆహారం అందించడం ప్రతి సంక్షేమ ప్రభుత్వం తొలి కర్తవ్యం. ఒకవేళ మీరు దీనిపై చర్యలు తీసుకుంటామంటే.. ఏ వ్యవస్థ కూడా మీకు అడ్డుచెప్పదు' అని పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పలు రాష్ట్రాల్లో పౌష్టికాహారలోపం, ఆకలితో చిన్నారులు చనిపోతున్న ఘటనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. అలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్న జిల్లా, తాలుకా, గ్రామాలను గుర్తించాలని సూచించింది. ఇదే సమయంలో పౌష్టికాహార లోపం, ఆకలికి సంబంధించినవి రెండు వేర్వేరు అంశాలని.. వీటిని ఒకదానితో ఒకటి కలపవద్దని సూచించింది. ఇక కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుపై రాష్ట్రాలతో చర్చించి ఉమ్మడి పథకాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదే సమయంలో రాష్ట్రాలు కూడా ఇందుకు సహకరించాలన్న సుప్రీం ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసే భేటీకి హాజరు కావాలని సూచించింది.
కమ్యూనిటీ కిచెన్‌ల ఏర్పాటులో రాష్ట్రాల అభ్యంతరాలు, నిధుల వాటాపై వాటితో చర్చించి మూడు వారాల్లో ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకు రావాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సమాధానమిచ్చిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. పూర్తి ప్రణాళికతో కోర్టు ముందుకు వస్తామని హామీఇచ్చారు.
ఇదీ చూడండి: 'పికప్' చేసుకోకుండా వెళ్లిన బస్సు.. ఆర్టీసీకి రూ.1000 ఫైన్!