Bank robbery Mumbai: పట్టపగలే బ్యాంకు దోపిడీకి పాల్పడ్డ దొంగలను 8 గంటల్లోనే పట్టుకున్నారు ముంబయి పోలీసులు. వారు చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.


Dahisar bank robbery news
భారతీయ స్టేట్ బ్యాంక్ దహిసర్ శాఖలో ఈ చోరీ జరిగింది. ఇద్దరు సాయుధులు మాస్కులు ధరించి బ్యాంకులోకి చొరబడి కాల్పులు చేశారు. ఉద్యోగులను బెదిరించి రూ.2.5 లక్షలను దోచుకున్నారు. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సందేశ్ గోమరే అనే బ్యాంకు ఉద్యోగిపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. సెక్యూరిటీ గార్డు గాయపడ్డాడు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఘటన జరిగింది.

దొంగతనం గురించి తెలియగానే ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎనిమిది బృందాలుగా ఏర్పడి.. నిందితుల కోసం వెతికారు. బ్యాంకు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దుండగులు డబ్బులు తీసుకొని పారిపోయే క్రమంలో.. తమ చెప్పులను బ్యాంకులోనే వదిలి వెళ్లిపోయారు. వాటి ఆధారంగా దొంగల ఆచూకీని కనిపెట్టిన పోలీసులు... అనంతరం అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: మరో రైల్వే స్టేషన్ పేరు మార్చిన యూపీ.. ఝాన్సీ రాణి పేరుతో..