స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 10 రోజులపాటు వాదనలు విన్న తర్వాత తీర్పును వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ SK కౌల్, జస్టిస్ SR భట్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ PS నరసింహతో కూడిన ధర్మాసనం ముందు.. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, రాజు రామచంద్రన్, కేవీ విశ్వనాథన్, ఆనంద్ గ్రోవర్, సౌరభ్ కిర్పాల్ వాదనలు వినిపించారు.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరుతున్న అభ్యర్థనలపై సుప్రీంకోర్టు ఏదైనా రాజ్యాంగ ప్రకటన చేస్తే అది సరైనచర్య కాకపోవచ్చని బుధవారం జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం తెలిపింది. ఎందుకంటే కోర్టు దాని పతనాన్ని ఊహించడం, గ్రహించడం, సాధ్యం కాకపోవచ్చని కేంద్రం పేర్కొంది. ఈ అంశంపై 7 రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు అందాయని, అవి స్వలింగ వివాహ బంధాన్ని వ్యతిరేకించినట్లు తెలిపింది.
స్వలింగ జంటల సమస్యలపై కమిటీ..
స్వలింగ జంటల సమస్యలను పరిష్కరించేందుకు మే 3న కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. LGBTQల సమస్యల పరిష్కారానికి పాలనాపరమైన చర్యలను అన్వేషించేందుకు కేబినేట్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. సామాజిక హక్కులకు దూరం అవుతున్న స్వలింగ జంటల సమస్యలను పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఏప్రిల్ 27న కేంద్రానికి సూచించిన నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ మేరకు స్పందించింది.
కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. LGBTQల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ధర్మాసనానికి తెలిపారు. అయితే వివాహ చట్టబద్ధత అంశం లేకుండా కమిటీ ఏర్పాటు జరుగుతుందని ఆయన చెప్పారు. ఇది ఒక మంత్రిత్వశాఖ పరిధిలోని అంశం కాదని.. అనేక మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో జరగాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏమేం చేయాలో LGBTQలు కూడా తమ సలహాలు, సూచనలు కమిటీకి ఇవ్వొచ్చని తుషార్ మెహతా కేంద్రం తరుపున వివరించారు. ఇన్సూరెన్స్ పాలసీల్లో భాగస్వామిని నామినీగా చేసే విషయం, జాయింట్ బ్యాంకు ఖాతాల వంటి అనేక అంశాల్లో LGBTQలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన న్యాయస్థానానికి తెలిపారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సలహాలు..
కొద్ది రోజుల క్రితం.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు సంబంధించిన కేసు విచారణలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను భాగం చేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ విషయంలో అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏప్రిల్ 18న లేఖలు రాసినట్లు ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. వివాహ వ్యవస్థకు సంబంధించి చట్టాలు చేసే బాధ్యతల గురించి రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో పేర్కొన్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్రాలను ఇందులో భాగం చేయాలని పేర్కొంది.