Safety Pin Stuck Boy Trachea : ఐదు నెలల చిన్నారి శ్వాసనాళంలో ఇరుక్కున్న సేఫ్టీ పిన్‌ను విజయవంతంగా తొలగించారు వైద్యులు. అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి చిన్నారి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన బంగాల్ రాజధాని కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో జరిగింది.
ఇదీ జరిగింది
Child Swallowed Safety Pin : హుగ్లీలోని జంగిపార ప్రాంతానికి చెందిన బాలుడిని.. పక్కనే ఆడుకుంటున్న తన తోబుట్టువుల వద్ద మంచంపై పడుకోబెట్టారు తల్లి. ఈ క్రమంలో బాలుడు ప్రమాదవశాత్తు సేఫ్టీ పిన్‌ను మింగేశాడు. ఆ తర్వాత అతడికి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో బాలుడు నిరంతరాయంగా ఏడవడం ప్రారంభించాడు. దీనిని గమనించిన తల్లిదండ్రులు.. వెంటనే బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
చిన్నారిని పరిశీలించిన డాక్టర్లు.. మొదటి అతడికి జలుబు చేసిందని భావించి.. దానికి అనుగుణంగా చికిత్స చేశారు. అయితే చిన్నారి నోట్లో నుంచి లాలాజలం నిరంతరాయంగా రావడం ప్రారంభమైంది. దీనికి తోడు బాలుడు ఆకలిని కూడా కోల్పోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. చిన్నారిని గురువారం మధ్యాహ్నం కలకత్తా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్స్‌రే తీసి, చిన్నారి శ్వాసనాళంలో పొడవాటి సేఫ్టీ పిన్ ఇరుక్కుపోయి ఉందని గుర్తించారు. ఈఎన్టీ విభాగం వైద్యుడు సుదీప్ దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం డాక్టర్లు శస్త్రచికిత్స ప్రారంభించారు. దాదాపు 40 నిమిషాల పాటు సర్జరీ చేసి సేఫ్టీ పిన్‌ను విజయవంతంగా బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు.
దీనిపై హెడ్ సర్జన్ డాక్టర్ సుదీప్ దాస్ స్పందించారు. 'సేఫ్టీ పిన్ శ్వాసనాళంలోకి వెళుతుందని మేము భయపడ్డాము. అందుకే మేము త్వరగా సర్జరీ చేయాల్సి వచ్చింది. కానీ అదృష్టవశాత్తు ఆ పిన్ శ్వాసనాళం లోపలికి వెళ్లలేదు. మేము చిన్నారి శ్వాసనాళం నుంచి సేఫ్టీ పిన్‌ను విజయవంతంగా బయటకు తీశాము' అని వివరించారు. ఈ శస్త్రచికిత్సను డాక్టర్ మైనక్ దత్తా, డాక్టర్ తనయ పంజా, సర్జన్ డాక్టర్ సుభ్రజ్యోతి నస్కర్, డాక్టర్ మృదుచంద దాస్, డాక్టర్ సుదీప్ దాస్ విజయవంతంగా నిర్వహించారు.
'మేకు'ను మింగేసిన బాలుడు.. ఛాతిలో ఇరుక్కుని నరకం.. చివరకు..
టంగ్ క్లీనర్ మింగేసిన యువకుడు.. ఛాతిలో నొప్పి.. నోటి మాట బంద్!.. ఆ తర్వాత ఏమైందంటే?