SAD 100th Anniversary: పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీని బలహీనపరచాలని భాజపా చూస్తోందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్. శిరోమణి అకాలీదళ్ పార్టీ స్థాపించి 100ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్‌లోని మోగాలో భారీ ర్యాలీ నిర్వహించింది ఆ పార్టీ. కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
"ఈ సారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 4 ఫ్రంట్లు ఉన్నాయి. భాజపా, కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్- బీఎస్పీ. అకాలీదళ్-బీఎస్పీ కూటమి మీదే. బీఎస్పీ పంజాబ్‌లో పుట్టింది. అకాలీదళ్, బీఎస్పీ మీ కష్టాలను అర్థం చేసుకున్నాయి. మీ కోసం పోరాడుతున్నాయి."
-- సుఖ్బీర్ సింగ్ బాదల్, శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు
Sukhbir Singh Badal News: భాజపా.. ప్రజల కోసం నల్ల రైతు చట్టాలను తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు బాదల్. దిల్లీ గురుద్వారా పరబంధక్ కమిటీ ఎన్నికల్లో అకాలీదళ్ గెలుపొందిందని, కానీ అధ్యక్షుడ్ని నియమించేందుకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు.
భాజపాకు చెందిన వ్యక్తినే కమిటి అధ్యక్షుడిగా నియమించాలని కేంద్రం చూస్తోందన్నారు. అకాలీదళ్‌ను బలహీనపరచాలని భాజపా యత్నిస్తోందని బాదల్ ఆరోపించారు.
ప్రగతికి కట్టుబడి ఉన్నాం..
"పంత్, పంజాబ్, పంజాబీ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, పంజాబ్‌ను శాంతి, ప్రగతి పథంలో నడిపించేందుకు శిరోమణి అకాలీదళ్ పార్టీ కట్టుబడి ఉంది." అని అకాలీదళ్ పార్టీ ట్వీట్ చేసింది.
BSP- SAD Alliance: అకాలీదళ్ పార్టీ స్థాపించి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో బీఎస్పీ పార్టీ అధినేత మాయావతి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
2022, మార్చిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవీ చూడండి:
ఓటు కోసం 'దళిత' వ్యూహం- దేశంలో నయా రాజకీయం!
పంజాబ్ 'మార్పు'తో.. కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పాలనుకునేది ఇదేనా?