బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాకు స్పుత్నిక్ వీ టీకాను తయారు చేసిన రష్యాకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ ఆసక్తికరమైన సూచన చేసింది. స్పుత్నిక్ వీ డోసులతో కలిపి ప్రయోగించి ఆస్ట్రాజెనెకా టీకా సమర్థతను పెంచాలని పేర్కొంది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకా మధ్యంతర ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. డోసుల తీరును బట్టి రెండు రకాల సమర్థతను టీకా కనబర్చింది. అయితే టీకాపై అదనపు ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తాజాగా ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గమలేయ సంస్థ ఈ సూచన చేసింది.
"ఆస్ట్రాజెనెకా పూర్తి డోసు వల్ల 62 శాతం సమర్థత వచ్చింది. ఒకవేళ వారు కొత్తగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తే.. 'స్పుత్నిక్ వీ'తో ఆస్ట్రాజెనెకా డోసును కలిపి ప్రయత్నించమని మేం సూచిస్తున్నాం. ఇలా టీకాలను కలపి ప్రయోగించడం రీవ్యాక్సినేషన్కు ఉపయోగపడొచ్చు."
-గమలేయ సంస్థ ట్వీట్
ఆగస్టులో స్పుత్నిక్ వీ టీకాకు రష్యా ఆమోదించింది. తద్వారా కరోనాకు టీకాను ఆమోదించిన తొలి దేశంగా నిలిచింది. ట్రయల్స్‌లో ఈ టీకా సమర్థత 92 శాతంగా ఉన్నట్లు తేలింది.
ఇదీ చదవండి- సుప్రీంకోర్టు సెలవుల్లో తొలిసారిగా సంక్రాంతి