Russia Ukraine war: ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి శనివారం 15విమానాల ద్వారా 3వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. అందులో 12పౌర విమానాలు ఉంటే మరో మూడు వాయుసేన విమానాలు ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా ఇప్పటి వరకు ఉక్రెయిన్ పరిసర దేశాల నుంచి 63 విమానాల ద్వారా 13,300 మంది భారతీయులను తరలించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Indians in Sumy
వచ్చే 24 గంటల్లో మరో 13 విమానాలను నడపనున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. సుమీలో చిక్కుకున్న వారిని తరలించడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. అయితే బాంబుదాడులు, హింసాత్మక ఘటనలు, రవాణా సదుపాయాల లేమి.. ఇందుకు అడ్డంకిగా నిలుస్తోందని తెలిపింది.
India students Ukraine
ఇప్పటివరకు 21వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ను వీడారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఖార్కివ్ నగరంలో భారతీయులెవరూ లేరని స్పష్టం చేసింది. పిసోచిన్ను కూడా భారతీయులు ఖాళీ చేస్తున్నారని వివరించింది. విద్యార్థులను తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఉక్రెయిన్‌లో ఇంకా 2 నుంచి 3 వేల మంది ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. సుమీ ప్రాంతంలోని భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వారిని తరలించేందుకు వీలుగా కాల్పుల విరమణ ప్రకటించాలని రష్యా, ఉక్రెయిన్‌ను కోరినట్లు తెలిపారు. అక్కడ ఉన్నవారు షెల్టర్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని స్పష్టం చేశారు.
విద్యార్థుల్లో అయోమయం..
అయితే, విదేశాంగ శాఖ ప్రకటనతో సుమీలో ఉన్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రష్యా దళాలు భీకర దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి రష్యా సరిహద్దు వైపు కొంతమంది విద్యార్థులు కాలినడకనే బయల్దేరారు. ఆహార సరఫరా లేకుండా, ఎముకలు కొరికే చలిలో తాము ఉండలేమంటూ బయటకు వచ్చేస్తున్నారు. కరిగించిన మంచు ద్వారా వచ్చిన నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. అయితే, ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని విదేశాంగ శాఖ కోరిన నేపథ్యంలో తమ ప్రయాణాన్ని కొనసాగించాలా, వద్దా అని ఆలోచిస్తున్నారు.
ఈ మేరకు పలువురు విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు షేర్ చేస్తున్నారు. వీరు ఉంటున్న ప్రాంతం రష్యాకు 50 కి.మీ దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదకరమని తెలిసినా.. రష్యా సరిహద్దును చేరుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు.
"మా వద్ద ఆహారం లేదు. తాగడానికి నీళ్లు లేవు. మాకు చాలా భయంగా ఉంది. ఇంకా మేం ఎదురుచూడలేం. మా జీవితాలను రిస్క్ చేస్తున్నాం. సరిహద్దు వైపు వెళ్తున్నాం. రష్యా సరిహద్దుకు వెళ్తే.. అక్కడి నుంచి భారత అధికారులు తీసుకెళ్లే అవకాశం ఉంది. మాకు ఏమైనా జరిగితే భారత ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీదే బాధ్యత."
-ఓ వీడియోలో విద్యార్థులు
మరో వీడియోలో విద్యార్థులు బకెట్లలో మంచును నింపుకోవడం కనిపిస్తోంది. తాగడానికి నీళ్లు లేక మంచును కరిగించి దాహం తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, విదేశాంగ శాఖ ప్రకటనతో కొంతమంది విద్యార్థులు తమ ప్రయాణాన్ని నిలిపివేసుకున్నారు. 'మేం ఇప్పటికే సరిహద్దు వైపు కదలడం ప్రారంభించాం. కానీ ఇప్పుడు ఇచ్చిన అడ్వైజరీతో మేం అయోమయానికి గురవుతున్నాం. మాకు భయమేస్తోంది' అని సుమీ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ తొలి సంవత్సరం చదువుతున్న నిజాముద్దీన్ అమన్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఆగని దాడులు.. రష్యా చేజారిన న్యూక్లియర్ ప్లాంట్- భారీగా సైనికులు మృతి