అధునాతన సుఖోయ్ ఐదోతరం యుద్ధవిమానంతో భారత్‌ను ఆకట్టుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. శత్రు రాడార్లను ఏమార్చే 'స్టెల్త్' పరిజ్ఞానం కలిగిన ఈ విమానాన్ని మన దేశానికి విక్రయించాలని గట్టిగా భావిస్తోంది. 'చెక్‌మేట్' అనే ఈ విమానాన్ని రష్యాలో జరిగిన 'మాక్స్-2021' వైమానిక ప్రదర్శనలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రష్యా ఉప ప్రధానమంత్రి యూరి బోరిసోవ్ మాట్లాడుతూ భారత్, వియత్నాం, ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు విక్రయించే ఉద్దేశంతో దీన్ని రూపొందించామని చెప్పారు. "ఈ విమానానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సమీప భవిష్యత్‌లో కనీసం 300 యుద్ధవిమానాలు అమ్ముడయ్యే అవకాశం ఉంది" అని చెప్పారు. ప్రధానంగా ఎగుమతుల కోసమే 'చెక్‌మేట్'ను రూపొందించారు. ఆరేళ్లలో ఈ యుద్ధవిమానాల సరఫరాను మొదలుపెడతామని సుఖోయ్ సంస్థ చెబుతోంది.
క్యాట్సా అవరోధం ఉంది
'చెక్‌మేట్' కొనుగోలుకు.. 'క్యాట్సా' చట్టం రూపంలో మనకు అమెరికా నుంచి అవరోధం ఎదురు కావొచ్చు. రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాతో లావాదేవీలు నిర్వహించే దేశాలపై ఆంక్షలు విధించడం దీని ఉద్దేశం. చారిత్రకంగా భారత్, రష్యాల మధ్య చాలా సన్నిహిత సైనిక సంబంధాలు ఉన్నాయి. మన ఆయుధాల్లో దాదాపు 60 శాతం రష్యా నుంచి వచ్చినవే. గత కొన్నేళ్లుగా భారత్.. అమెరికాకు చేరువవుతోంది. దీంతో భారత్-రష్యా సంబంధాల్లో కొన్ని అపోహలు మొదలయ్యాయి.
తేజస్, మిగ్-29
మరోవైపు తరిగిపోతున్న తన యుద్ధవిమానాల సంఖ్యను పూరించుకునేందుకు భారత్ చర్యలు ముమ్మరం చేసింది. రూ.48వేల కోట్లతో 83 తేజస్ ఫైటర్ జెట్‌ల సరఫరాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌ఏఎల్‌తో రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో 73 యుద్ధవిమానాలు 'మార్క్-1ఏ' రకం కాగా.. 10 జెట్‌లు మార్క్-1 ట్రైనర్ తరగతికి చెందినవి. వీటికితోడు రష్యా నుంచి ఫైటర్ జెట్‌ల సేకరణకూ భారత్ ప్రయత్నిస్తోంది. 21 మిగ్-29 యుద్ధవిమానాల కొనుగోలుకు వాణిజ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. 12 సుఖోయ్-30 ఎంకేఐ జెట్‌ల సేకరణ అంశం పరిశీలనలో ఉంది.
అధునాతనం..
చెక్‌మేట్‌లో రాడార్‌ను బోల్తా కొట్టించే స్టెల్త్ పరిజ్ఞానం ఉంది. ధ్వనితో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ వేగం (2.2 మాక్)తో ఇది దూసుకెళ్లగలదు. 54వేల అడుగుల ఎత్తు వరకూ వెళ్లగలదు. రష్యా సంప్రదాయ యుద్ధవిమాన డిజైన్లకు ఇది భిన్నం. దీనిలో ఒకే ఇంజిన్ ఉంది. తోకభాగంలో నాలుగు భిన్న ఫలకాలు ఉన్నాయి. రష్యా యుద్ధవిమానాల్లో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఈ దేశం చివరిసారిగా 1970లలో ఒకే ఇంజిన్‌తో కూడిన ఫైటర్ జెట్‌ను రూపొందించింది. ఇందులో అనేక రకాల ఆయుధాలను అమర్చే వీలుంది. శత్రు యుద్ధవిమానాల నుంచి వెలువడే వేడి వాయువుల ఆధారంగా వాటిని వెంటాడి కూల్చేసే ఆర్-73 హీట్ సీకింగ్ క్షిపణి, రాడార్ ద్వారా పనిచేసే ఆర్-77 విమాన విధ్వంసక క్షిపణి, నౌకా విధ్వంసక కేహెచ్-59ఎంకే క్రూజ్ క్షిపణి ఉంటాయి. ఆయుధాల అరలో నుంచి క్షిపణి ఆకారంలో ఉండే డ్రోన్లను ప్రయోగించడం దీని ప్రత్యేకత.
భలే మంచి చౌక బేరం
'చెక్‌మేట్'కు చాలా ఆకర్షణీయ ధరను ఖరారు చేశారు. ఒక్కో యుద్ధవిమానం రూ.186-224 కోట్లు పలకనుంది. శిక్షణకు వాడే రకం విమానం రూ.280కోట్లకు లభించనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ ఉత్పత్తి చేసిన తేజస్ మార్క్-1 ధర (రూ.309 కోట్లు) కన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం. ఫ్రాన్స్ నుంచి భారత్ దిగుమతి చేసుకున్న '4.5 తరం' యుద్ధవిమానం రఫేల్‌తో పోల్చినా చెక్‌మేట్ ధర ఆకట్టుకునే స్థాయిలో ఉంది. ఒక్కో రఫేల్‌ను రూ.1,638 కోట్లకు మన దేశం కొనుగోలు చేసింది.
విమానాల కొరత
భారత వాయుసేన ఆధునిక యుద్ధవిమానాలకు తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ దళం వద్ద 33 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. పాక్, చైనాలతో ఏకకాలంలో యుద్ధం చేయాల్సి వస్తే తిప్పికొట్టడానికి మనకు కనీసం 43 స్క్వాడ్రన్లు అవసరం. ఒక్కో స్క్వాడ్రన్‌లో 16- 18 యుద్ధవిమానాలు ఉంటాయి. ప్రస్తుతం మన వైమానిక దళంలో రఫేల్, సుఖోయ్-30, మిగ్-29, మిరాజ్-2000 యుద్ధవిమానాలు ఉన్నాయి. 2032 నాటికి కనీసం 45 స్క్వాడ్రన్లు కలిగి ఉండాలని భారత వాయుసేన లక్ష్యంగా పెట్టుకొంది. ఈ ప్రణాళికను వేగవంతంగా ఆచరణలోకి తెచ్చేందుకు కసరత్తు చేపట్టింది. చెక్‌మేట్‌ను భారత్‌కు విక్రయించేందుకు ఇది ఉపకరిస్తుందని రష్యా భావిస్తోంది.
ఇదీ చదవండి: