మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బయట రాష్ట్రాల నుంచి బెంగళూరు నగరానికి వచ్చే ప్రయాణీకులకు ఆర్‌టీ- పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనను అమలు చేయనున్నట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వెల్లడించారు. ఈ నిబంధన కేవలం బెంగళూరు మహా నగరానికే వర్తిస్తుందని స్పష్టంచేశారు.
అంతరాష్ట్ర ప్రయాణికులే..
రాబోయే రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. బెంగళూరు నగరంలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 60శాతానికి పైగా అంతర్రాష్ట్ర ప్రయాణికులే ఉన్నారన్నారు. నిన్న ఒక్కరోజే బెంగళూరు మహానగరంలో 1400 కొవిడ్ కేసులు రావడంతో గురువారం ఉదయం మంత్రి సుధాకర్ అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, చండీగఢ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.
మార్షల్స్‌తో పక్కాగా..
నగరంలోని పెద్ద పెద్ద భవన సముదాయాల్లోనే ఎక్కువ కేసులు వస్తున్నాయని సుధాకర్ వెల్లడించారు. గతంలో కేవలం తల్లిదండ్రులకే తప్ప పిల్లలకు పాజిటివ్‌గా వచ్చేది కాదన్నారు. కానీ తాజాగా మొత్తం కుటుంబానికి పాజిటివ్‌గా నిర్ధరణ అవుతోందన్నారు. బస్ స్టేషన్లు, మార్కెట్లు, థియేటర్లు, కల్యాణ మండపాలు, కన్వెన్షన్ హాళ్లు, పాఠశాలలు, కళాశాలల క్యాంపస్‌ల వద్ద భౌతికదూరం, మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలు అమలయ్యేలా మార్షల్స్‌ను పెడతామని తెలిపారు.
నాందేడ్‌లో లాక్‌డౌన్..
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏప్రిల్ 4వరకు లాక్‌డౌన్ విధించారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రం ఉదయం 7-12 గంటల వరకు అనుమతించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'మహా' కరోనా కేసుల్లో సరికొత్త రికార్డు