Road Accident in Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రంపచోడవరంకు చెందిన పది మంది టాటా మ్యాజిక్ వ్యాన్లో కొత్తపేట మండలం మందపల్లిలోని దర్శనానికి వస్తుండగా వైజాగ్ నుంచి భీమవరం వెళ్తున్న ఒక కారు.. వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న ముగ్గురు, కారులోని మరొక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సుండుపల్లి మండలం కొండల తూర్పు గ్రామంలో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇంటి బయట మంచంలో నిద్రిస్తున్న రామాంజనేయ రెడ్డి అనే వ్యక్తిని అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపారు. మంచంలో రామాంజనేయరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం ఇంట్లో నిద్రిస్తున్న ఆయన భార్య పైన కూడా దాడి చేసి బంగారు గొలుసులు లాక్కు నేందుకు ప్రయత్నించగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. రెండు వేట కొడవళ్లను మంచం వద్దే వదిలి పరారయ్యారు. దుండగులు డబ్బు కోసమే ఇంట్లోకి చొరబడి రామాంజనేయ రెడ్డినీ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే కువైట్ నుంచి వచ్చిన రామాంజనేయ రెడ్డి దగ్గర డబ్బు చాలా ఉంటుందని భావించిన దుండగులు అగాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.