అసోంలోని కరీమ్గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఆటోను ఢీకొన్న ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు.
బైతకాల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులంతా ఓ పూజా కార్యక్రమానికి హాజరై ఆటోలో తిరిగి వస్తున్నారని చెప్పారు. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టిందని వివరించారు. మృతులంతా ఆటో ప్రయాణికులేనని తెలిపారు.
ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. అతడ్ని పట్టుకునేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రైవర్ను వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ.. రహదారులను అడ్డుకున్నారు.
రూ.లక్ష పరిహారం
ప్రమాదంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం ప్రకటించారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఇదీ చదవండి: తమిళనాడులో వర్ష బీభత్సం- 4 రోజుల్లో 91 మంది మృతి..