రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) చీఫ్ అజిత్ సింగ్ కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆయన గురువారం ప్రాణాలు కోల్పోయారు. అజిత్ మరణాన్ని ఆయన తనయుడు జయంత్ చౌదరీ ధ్రువీకరించారు.
ఏప్రిల్ 20న కొవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు అజిత్ సింగ్. కరోనాకు చికిత్స పొందుతూనే మరణించారు.
మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్. 1939 ఫిబ్రవరి 12న ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో జన్మించారు. కేంద్రమంత్రిగా పనిచేసిన చౌదరి అజిత్ సింగ్.. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. యూపీఏ హయాంలో పౌరవిమానాయానశాఖ మంత్రిగా సేవలందించారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
అజిత్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా దేశ రాజకీయాలపై అజిత్ సింగ్ తనదైన ముద్ర వేశారని రాష్ట్రపతి పేర్కొన్నారు.
అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అజిత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ఆయన ఎల్లప్పుడు పాటుపడ్డారని మోదీ కీర్తించారు. కేంద్రంలోని అనేక శాఖల్లో సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేశారు. అజిత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: విషాదం: పిడుగుపాటుతో ముగ్గురు మృతి