Revanthreddy Komatireddy Meet Ponguleti : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరిక వ్యవహారం తుదిదశకు చేరింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఇతర సీనియర్ నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి... ఈ ఇద్దరి నేతల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. ముందుగా జూపల్లి కృష్ణారావును కలిసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల బృందం పార్టీలోకి రావాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇంటికి వెళ్లిన నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ చేరిక అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది
జూలై 2న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న పొంగులేటి, జూపల్లి : జూపల్లితో భేటీ అనంతరం పొంగులేటి నివాసానికి చేరుకున్న రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కేసీఆర్‌ను గద్దెదించేందుకు కలిసిరావాలని కోరినట్లు తెలుస్తోంది. ఐతే జూపల్లి, పొంగులేటి ఇద్దరూ జులై 2న ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ సభకు రాహుల్‌గాంధీ హాజరుకానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 25నే దిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమై చర్చించి, 26న దిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన పార్టీలోకి చేరికను ప్రకటిస్తారని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలోనూ ఖమ్మం బహిరంగ సభపై చర్చించినట్లు తెలుస్తోంది.
BRS Leaders to Join Congress : బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లి తదితరులతో బీజేపీ నేతలు మొదట చర్చలు జరిపారు. రాష్ట్రంలో అధికార పార్టీని బీజేపీనే గట్టిగా ఎదుర్కోగలదనే అంచనాతోపాటు ఈటల రాజేందర్‌తో ఉన్న వారికున్న స్నేహంతో పలు దఫాలు చర్చలు జరిగాయి. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరడమే మంచిదనే అభిప్రాయం అనుచరుల నుంచి వ్యక్తం కావడం, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం తదితర కారణాలతో పొంగులేటి, జూపల్లి ఊగిసలాటలో పడ్డారు. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ను ఓడించాలంటే ఆ పార్టీ వ్యతిరేకులంతా ఓ గ్రూపుగా ఏర్పడి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడం, లేదా అందరూ కలిసి ఒకే పార్టీలోకి వెళ్లడం తదితర ప్రత్యామ్నాయాలపై ఈ నాయకులంతా కలిసి నెల రోజులుగా తరచూ చర్చలు జరిపారు.
పొంగులేటితో పాటు కాంగ్రెస్‌లోకి మరికొందరు నేతలు : బీజేపీలో కూడా ఈటలకు, కాంగ్రెస్ నుంచి వెళ్లిన నాయకులకు తగిన ప్రాధాన్యం లభించలేదనే ప్రచారంపైన కూడా చర్చించినట్లు తెలిసింది. ఈటలను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తారంటూ వార్తలొచ్చినా చివరకు అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు గత మూడు, నాలుగు రోజులుగా విస్తృతంగా సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. చివరకు ఈటల, రాజగోపాల్‌రెడ్డిలు తాము బీజేపీని వీడేది లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు కూడా చేరతారనే ప్రచారం జరుగుతోంది.
ఇవీ చదవండి :