ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణల్లో నిజ నిజాలు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించనుంది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారని అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. అనిల్ అంబానీ ఇంటి పరిసరాల్లో పేలుడు పదార్థాల కారు కేసు ఉందంతం మహారాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టిందని శివసేన అధికార పత్రిక 'సామ్నా' విమర్శించడం గమనార్హం.
''ముంబై మాజీ సీపీ పరమ్‌బీర్ సింగ్ నాపై చేసిన అన్ని ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించారు'' అని అనిల్ దేశ్‌ముఖ్ మీడియాకు వెల్లడించారు.
సామ్నా విమర్శలు..
కొంతమంది సీనియర్ అధికారులను హోంమంత్రి అకారణంగా బదిలీ చేశారని.. అవసరమైన సందర్భాల్లో మాత్రమే హోంమంత్రి స్పందించాలని.. అనవసరంగా కెమెరా ముందుకు రావడం మంచిది కాదని 'సామ్నా' సంపాదకీయంలో అభిప్రాయపడింది. రాష్ట్ర హోంమంత్రి పదవిలో ఉన్నవారు అనుమానాలతో పని కొనసాగించలేరని రాసుకొచ్చింది. పోలీసు శాఖ ఇప్పటికే అపఖ్యాతి పాలైందని.. ఇలాంటి చర్యలతో మరింత అపకీర్తి మూటగట్టుకోవాల్సి వస్తుందని పేర్కొంది.
ఇదీ చదవండి: 'మహా'లో లేఖ రచ్చ- ఠాక్రే సర్కార్‌పై ఒత్తిడి!
ఇదీ చదవండి: నాపై దర్యాప్తు చేపట్టండి: దేశ్‌ముఖ్
యాక్సిడెంటల్ హోం మినిస్టర్..
అనిల్ దేశ్‌ముఖ్ అనుకోకుండా హోంమంత్రి అయ్యారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఎన్‌సీపీలో జయంత్ పాటిల్, దిలీప్ వాల్సే వంటి సీనియర్ నాయకులు హోంమంత్రి పదవిని స్వీకరించేందుకు ముందుకు రాలేదని.. దీంతో శరద్ పవార్ అనిల్‌ను ఎంపిక చేశారని సామ్నా పత్రికలో రాసుకొచ్చారు. పరమ్‌బీర్ సింగ్ ఆరోపణలపై స్పందించిన రౌత్.. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడే యంత్రాంగం కరవైందన్నారు. ముంబై పోలీసుల్లో వాజే కేవలం ఏపీఐ అని.. అతనికి ఇన్ని అధికారాలు ఎవరిచ్చారని రౌత్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'నైతిక అర్హత కోల్పోయిన మహా సర్కార్'
సర్కారును కూల్చలేరు..
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం బలంగానే ఉందన్నారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్. అనిల్ దేశ్‌ముఖ్‌ను యాక్సిడెంటల్ హోంమంత్రిగా అభివర్ణించిన రౌత్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషించిన ఆయన.. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లోని ప్రతి పార్టీ అంగీకారంతోనే కేబినెట్ కూర్పు జరిగిందనే విషయం గుర్తించాలన్నారు. కేబినెట్‌కి సంబంధించి అన్ని నిర్ణయాలు తమ పార్టీ అధినేత శరద్ పవార్ తీసుకుంటారని స్పష్టం చేశారు. మిగతా పార్టీలు సైతం వారి అధిష్ఠానం సూచనల ప్రకారం నడుచుకోవాలన్నారు.
మంచిరోజులున్నాయ్..
సామ్నా పత్రిక చేసిన వ్యాఖ్యలపై సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు మరో మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్. హోంమంత్రి విధుల నిర్వహణలోని లోపాలను అనిల్ దేశ్‌ముఖ్ అధిగమించడానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పరమ్Xదేశ్‌ముఖ్- 'మహా'లో లేఖ దుమారం