Republic day celebrations: జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అరగంట ఆలస్యంగా ప్రారంభమవుతాయని రక్షణశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు వేడుకలు మొదలవుతాయని తెలిపింది. విమాన విన్యాసాలకు ఆ సమయం అనుకూలంగా ఉన్నందునే సమయంలో మార్పులు చేసినట్లు వివరించింది.
శకటాలపై రాజకీయ దుమారం..
గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే శకటాలపై ఈసారి రాజకీయ దుమారం చెలరేగింది. బంగాల్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు తమ శకటాలను ప్రదర్శించాలని చేసిన విజ్ఞప్తిని రక్షణ శాఖ తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ప్రధానిని కోరినప్పటికీ.. నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. బంగాల్ శకటాన్ని 2016, 2017, 2019, 2021 గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించామని, ఈ సారి 12 రాష్ట్రాలకే ఆ అవకాశం కల్పిస్తున్నామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. మమతా బెనర్జీకి లేఖ ద్వారా సమాధానమిచ్చారు. ఇదే తరహాలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా లేఖ పంపారు రాజ్‌నాథ్.
Republic day tableau 2022
ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకల్లో 12 రాష్ట్రాలు, 9 కేంద్ర శాఖలకు చెందిన శకటాలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, హరియాణా, గోవా, గుజరాత్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రత్యేకతలకు సంబంధించిన శకటాలు ప్రదర్శిస్తాయి. ఈ సారి కూడా శకటాల ప్రదర్శనకు తెలుగు రాష్ట్రాలకు అవకాశం లభించలేదు. విద్యా-నైపుణ్యాభివృద్ధి, విమానయానం, తపాలా, హోం, జలశక్తి, సాంస్కృతిక శాఖల శకటాలకు అవకాశం ఇస్తున్నట్లు రక్షణశాఖ పేర్కొంది. మొత్తం 56 శకటాలకు ప్రతిపాదనలు రాగా.. 21 శకటాలను ఖరారు చేసినట్లు వెల్లడించింది.
Beating retreat
1000 డ్రోన్లతో ప్రదర్శన..
గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించే బీటింగ్ రిట్రీట్లో ఈసారి 1000 డ్రోన్లతో ప్రదర్శన ఉండనుంది. ఐఐటీ దిల్లీకి చెందిన ఓ అంకుర సంస్థ దిన్నీ నిర్వహించనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా ఈ ప్రదర్శనను రూపొందిస్తున్నారు. అంతేకాకుండా తొలిసారి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ గోడలపై లేజర్ షో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీటింగ్ రిట్రీట్లో డ్రోన్ల ప్రదర్శన, లేజర్ షో ఉండటం ఇదే మొట్టమొదటి సారి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
బీటింగ్ రిట్రీట్లో త్రివిధ దళాలు బ్యాండ్‌తో ప్రదర్శన చేస్తాయి. గణతంత్ర వేడుకల చివరిరోజున ఈ కార్యక్రమం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి జనవరి 29న బీటింగ్ రిట్రీట్ జరగనుంది.
అతిథులు లేకుండా..
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు మధ్య ఆసియా దేశాల అధినేతలు ఎవరూ హాజరుకావడం లేదని అధికారులు తెలిపారు. ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, టర్క్‌మెనిస్థాన్, కజఖ్‌స్థాన్, టజికిస్థాన్ దేశాలకు గతేడాదే భారత్ ఆహ్వానం పంపినప్పటికీ.. కరోనా కారణంగా నిర్ణయం మార్చుకుంది. ఈ దేశాలతో భారత్‌కు శతాబ్దాల అనుబంధం ఉంది. ఆర్థిక, ఔషధ, పర్యటక, దౌత్య సంబంధాల్లో ప్రత్యేక అనుబంధం కొనసాగిస్తోంది.
ఇదీ చదవండి: డిజిటల్ పంచ్‌లు.. పేరడీ పాటలు.. ఐదు రాష్ట్రాల్లో నయా రాజకీయం!