మ్యాప్‌ల తయారీ, జియోస్పేషియల్ డేటా ఉత్పత్తిపై ప్రభుత్వ నియంత్రణలు తొలగిపోయాయి. ఈ రంగాన్ని కేంద్రం పూర్తిగా సరళీకరించింది. దీంతో ఇలాంటి సమాచార నిర్వహణపై దేశీయ ప్రైవేటు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఫలితంగా ఈ రంగంలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు మెరుగుపడతాయని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య సమానావకాశాలకు వీలు కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు మేలు కలుగుతుందని వివరించింది.
"ఇది.. 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికత దిశగా వేసిన భారీ ముందడుగు. ఈ సంస్కరణ వల్ల దేశంలోని రైతులు, అంకుర పరిశ్రమలు, ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు, పరిశోధన సంస్థలకు లబ్ధి కలుగుతుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇప్పటివరకూ మ్యాపింగ్ ప్రక్రియను ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'సర్వే ఆఫ్ ఇండియా' సంస్థ నిర్వహించేది. తాజా సరళీకరణతో దేశంలోని ఏ సంస్థ అయినా ఈ ప్రక్రియలో పాల్గొని, లబ్ధి పొందొచ్చు. సర్వే, మ్యాపింగ్, వాటి ఆధారంగా వినియోగ సాధనాల రూపకల్పనకు ముందస్తు అనుమతులు పొందాల్సిన అవసరం లేదని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అశుతోష్ శర్మ చెప్పారు.
"భారత కంపెనీలకు సంబంధించి పూర్తిస్థాయిలో నియంత్రణలను తొలగిస్తున్నాం. అవి మ్యాప్‌లు సహా జియోస్పేషియల్ డేటా, సేవలు పొందడానికి, ఉత్పత్తి చేయడానికి ముందస్తు ఆమోదాలు, భద్రతా అనుమతులు, లైసెన్సులు అవసరం లేదు"
-అశుతోష్ శర్మ, కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి
నాణ్యమైన మ్యాప్‌ల లభ్యత లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న పలు రంగాలకు ఈ సంస్కరణల వల్ల ప్రయోజనం కలుగుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. తాజా నిర్ణయం వల్ల 2030 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన జియో స్పేషియల్ డేటాను సేకరించడానికి, వినియోగించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఈ సంస్కరణతో అంతరిక్ష పరిశ్రమ, 5జీ వంటి రంగాలకు లబ్ధి కలుగుతుందని అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
ఇదీ చూడండి: త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ!