Record Level Rain Mulugu : వర్షం దంచింది.. వరద ముంచింది.. 64.9 సెం.మీ. రికార్డు వాన నమోదయింది - లక్ష్మీదేవిపేటలో 64 సెంట్లీ మీటర్ల వర్షం
Record Level Rain Telangana : రాష్ట్ర వర్షపాతంలో రోజురోజుకు కొత్త గణాంకాలు నమోదవుతున్నాయి. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో రికార్డుస్థాయిలో 64.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వరంగల్ ఉమ్మడి జిల్లాలో సాధారణ పరిస్థితులు వచ్చేందుకు.. మరో రెండుమూడు రోజులు పట్టే అవకాశం ఉంది. వరంగల్ నగరంలోని కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇవాళ కూడా సహాయక, పునరావాస చర్యలు కొనసాగనున్నాయి. వరదలతో ఉమ్మడి జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
Record Level Rainfall in Mulugu : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. తెలంగాణ పదేళ్ల చరిత్రలో నమోదైన రికార్డును తిరగరాస్తూ వర్షపాతంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ములుగు జిల్లాలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. రాష్ట్రం చరిత్రలో 2013 జూలై 19న ములుగు జిల్లా వాజేడులో 51.75 సెంటీమీటర్ల వర్షమే అత్యధికంగా ఉండేది. గురువారం దాన్ని మూడో గరిష్టానికి చేరుస్తూ వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 64.9 సెంట్లీ మీటర్ల వర్షం నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.
Record Level Rainfall in Telangana : భారీవర్షాలకు చారిత్రక నగరి ఓరుగల్లు చిగురుటాకులా వణికింది. తుపాను బీభత్సం గుర్తుచేసే విధంగా చెట్లు కూలగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నగరంలోని ప్రధాన రోడ్లు వాగులని తలపిస్తున్నాయి. హనుమకొండ, వరంగల్, కరీంనగర్ వెళ్లే రహదారులు పూర్తిగా జలమయమవడంతో రాకపోకలు నిలిచాయి. హనుమకొండలో 50 కాలనీలు నీటమునగగా వరంగల్‌లో 150 కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న... కాలనీ వాసులకు ఇంకా వరద భయం వీడలేదు. గ్రేటర్ పరిధిలో 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా... వరద ముంపులో ఉన్న 1163 ఇళ్లు ఖాళీ చేయించి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నగరంలోని నాలాలన్నీ ఉప్పొంగడంతో... వరదనీరు ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది. వరద ఉధృతిలో సర్వం కోల్పోయామని... బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. వరంగల్ నగరానికి వరద ముంపు ఎప్పుడు తీరుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Warangal Rains 2023 : వరంగల్ నగరంలో మైసయ్యనగర్, సమ్మయ్య నగర్, బి.ఆర్ నగర్, రాజీవ్ నగర్, సుందరయ్యనగర్, ఎస్ ఆర్ నగర్ కాలనీలు, సంతోషిమాత నగర్, గణేష్ నగర్, హంటర్ రోడ్డు పరిసరాలు నీట మునిగే ఉన్నాయి. వరద ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మేయర్ గుండు సుధారాణి, శాసనసభ్యులు ఇతర నేతలు పర్యటించి.. బాధితులకు ధైర్యం చెప్పారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాఖాల సరస్సు భారీ వర్షాలతో మత్తడి పోస్తుండడంతో పాఖాల వాగు ఉగ్రరూపం దాల్చింది. నర్సంపేట పాఖాల మీదుగా కొత్తగూడ, గంగీరం ఇల్లందు వయా భద్రాచలం వెళ్లే రహదారి పూర్తిగా మూసివేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాకాల సరస్సును సందర్శించారు. రాయపర్తి మండలం తిర్మలాయపల్లి చెరువు వరద ప్రవాహంలో బాలుడు గల్లంతయ్యాడు. ప్రవాహంలో కొట్టుకువెళ్తున్న బాలున్ని గ్రామస్థులు సాహసించి కాపాడి ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో రెండురోజులుగా ఎడతెరిపినివ్వకుండా కురిసిన వరణుడు కాస్త శాంతించాడు. ఆకేరు, మున్నేరు, పాలేరు వాగుల్లో వరద ప్రవాహం మాత్రం కొనసాగుతోంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగును ఎమ్మెల్యే రెడ్యానాయక్, కలెక్టర్ శశాంక పరిశీలించారు. కేసముద్రంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లోకి నీరు చేరడంతో కోళ్లు మృతి చెందాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రవాహాల వద్ద భారీ కేడ్లు పెట్టి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్ వ్యాప్తంగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలిమెల మండలంలో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు చేశారు. మలహార్ తాడిచర్ల ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మల్లారం గ్రామంలోని పలు చోట్ల ఇళ్లల్లోకి వర్షపునీరు చేరగా బాధితులు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో, పాఠశాలలో తలదాచుకున్నారు. కాటారం మండలంలోని గంగారం గ్రామంలో వ్యవసాయ పనులు నిమిత్తం పొలానికి వెళ్లిన నలుగురు వరద ప్రవాహం పెరగడంతో వరదలోనే చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు స్థానికుల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జోరువానకు ములుగు జిల్లాలో ఉన్న 803 చెరువులు, కుంటలు ఉన్నాయని అన్ని చెరువులు నిండగా... వెంకటాపూర్ మండలంలోని బూరుగుపేట గ్రామ శివారులో ఉన్న మారేడు కొండ చెరువుకు మూడు దిక్కుల గండి పడిందని కలెక్టర్ తెలిపారు. బూరుపేటలో వరద ఉద్ధృతికి ముగ్గురు కొట్టుకుపోయారని వారిలో... ఒకరు మృతి చెందారని అన్నారు. ములుగులో లోకంచెరువు మత్తడికి గండి పడిందన్న కలెక్టర్.. మేడి వాగుకు ఎగువన కురిసిన వర్షాలకు వరద నీరు ఎక్కువ అవ్వడంతో రామప్ప సరస్సుకు 33 అడుగుల వరద నీరు చేరిందన్నారు. ముందస్తు జాగ్రత్తగా వరద ముప్పునకు గురి కాకముందే అధికారులు పాల్ సబ్ పల్లి గ్రామంలోని 20 మందిని పునరావాస కేంద్రానికి తరలించారని వివరించారు. జిల్లాలోని వరద ముప్పున గురవుతున్న గ్రామాలు ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, బెస్తగూడెం... మంగపేట మండలంలోని కొండూరుపల్లి గ్రామ ప్రజల కోసం పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ... అంతా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి :