వామపక్షాలు-పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో మృతిచెందిన డీవైఎఫ్ఐ కార్యకర్త కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండంగా ఉంటుందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపారు. ఘర్షణలపై వామపక్ష నేత సుజన్ చక్రవర్తితో మాట్లాడినట్లు స్పష్టం చేసారు.
"డీవైఎఫ్ఐ కార్యకర్త మైదుల్ ఇస్లాం మిద్దా మృతిపై అసలు కారణాలు పోస్టుమార్టం అనంతరం తెలుస్తాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిద్దా కుటుంబసభ్యులు ఠాణాలో కేసు కూడా నమోదు చేయలేదని తెలిసింది. కార్యకర్త మృతిచెందడం బాధాకరం."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
కోల్కతాలోని ఎస్ల్పేనేడ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి 11న ఉద్యోగాలు డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడికి బయల్దేరిన వామపక్ష కార్యకర్తలపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో మిద్దా అనే డీవైఎఫ్ఐ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

కార్యకర్తల ఆగ్రహం....
మిద్దా మృతితో ఆగ్రహించిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కార్యకర్తలు కోల్కతాలో రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు.


ఇదీ చదవండి:లోయలో వాహనం పడి ఆరుగురు మృతి