స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్వతంత్ర సమరయోధుల వేషధారణల్లో విద్యార్థులు పాఠశాలల్లో వివిధ నాటకాలు ప్రదర్శిస్తారు. 15రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం ఉన్న నేపథ్యంలో చేపట్టిన విద్యార్థుల నాటక ప్రదర్శన రిహార్సల్స్‌లో విషాదం జరిగింది. భగత్ సింగ్ నాటకంలో భాగంగా ఉరి సన్నివేశంపై రిహార్సల్స్ చేయబోయి ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బదవూన్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది..
జిల్లాలోని కున్వార్గావూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బబత్ గ్రామానికి చెందిన భురే సింగ్ కుమారు శివమ్ (10). పాఠశాలలో భగత్ సింగ్ నాటకంలో తోటి విద్యార్థులతో కలిసి రిహార్సల్స్‌లో పాల్గొన్నాడు. భగత్‌సింగ్‌ను ఉరి తీసే సన్నివేశంలో.. శివమ్ మెడ చుట్టూ తాడు చుట్టుకున్నాడు. అయితే.. అతను నిలుచున్న స్టూలు పడిపోయి.. మెడకు ఉరి బిగుసుకుంది. అక్కడే ఉన్న విద్యార్థులు భయంతో సాయం కోసం అరవగా.. స్థానికులు పరుగున వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. తాడును కత్తెరించి శివమ్‌ను కిందకు దించారు. కానీ, అప్పటికే శివమ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఘటన జరిగిన క్రమంలో పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బాలుడి అత్యక్రియలు ముగించారు కుటుంబ సభ్యులు.
సమాచారం తెలుసుకుని కున్వార్గావూన్ పోలీసులు గ్రామానికి వెళ్లారని, కానీ బాలుడి కుటుంబీకులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించినట్లు బదవూన్ ఎస్ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: రూ.500కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న