మహిళల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించిఉంటే మన్నించమని కోరారు. జీన్స్‌ను ధరించడం పట్ల అభ్యంతరం లేదని, చిరిగిన జీన్స్ వస్త్రాలు ధరించటం మాత్రం సరైన పద్ధతి కాదని మళ్లీ చెప్పారు.
పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, మంచి విలువలు నేర్పితే.. భవిష్యత్‌లో ఓడిపోరని వివరించారు. పాఠశాల రోజుల్లో ఎప్పుడైనా తమ ప్యాంటు చిరిగితే టీచర్ ఆగ్రహిస్తుందేమో అని భయపడేవాళ్లమన్నారు.
ఉత్తరాఖంఢ్ సీఎంగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన తీరథ్ సింగ్ రావత్.. మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చిరిగిన జీన్స్ ధరించిన మహిళలు సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నడ్డాతో రావత్ భేటీ..
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రావత్‌ను.. దిల్లీ రావాలని భాజపా అధిష్ఠానం పిలిచినట్లు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత.. ఆయన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీ దాదాపు 2 గంటలు సాగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : బంగాల్ తొలి దశలో 25% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు