కేంద్ర మాజీ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్లకు భాజపా(BJP)లో కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. త్వరలోనే కొత్త నియామకాలను భాజపా ప్రకటించనుంది. ఇందులో భాగంగా వీరికి జాతీయ కార్యదర్శి లేదా పార్టీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా.. త్వరలో ఎన్నికలు జరిగే వివిధ రాష్ట్రాల్లో వీరికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పాయి.
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ(central cabinet reshuffle)లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 43 మంది కేంద్ర మంత్రులుగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇదివరకు ఉన్న 53 మంత్రులలో 12 మందికి ఉద్వాసన పలికారు. ఈ 12 మందిలో రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్ కూడా ఉన్నారు.
మోదీ మీటింగ్..
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తంపై.. భాజపా అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కీలక నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. మరోసారి చర్చలు జరిపారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. ఇటీవల పలు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో భాజపా సాధించిన ఫలితాలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
అంతకుముందు భాజపా జాతీయ కార్యవర్గంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) సమావేశమయ్యారు. గత నెలలోనూ పార్టీ అనుబంధ శాఖల అధ్యక్షులతో సమావేశమైన మోదీ పలు అంశాలపై చర్చించారు.
ఇవీ చూడండి: