పక్షుల్లో కనిపించే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా(బర్డ్ ఫ్లూ) రాజస్థాన్‌లో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఝలావాడ్ జిల్లాలో చనిపోయిన వంద కాకులలో ఈ ఫ్లూను అధికారులు గుర్తించారు. పలు కాకులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. మరిన్ని పరీక్షల కోసం నమూనాలను భోపాల్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఝలావాడ్ జిల్లాలోని ఓ స్థానిక ఆలయం వద్ద వంద కాకులు చనిపోయాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం... ఆలయానికి కిలోమీటర్ పరిధిలో ఎవరూ తిరగకుండా కర్ఫ్యూ విధించింది. ర్యాపిడ్ రెస్పాన్స్ దళం రంగంలోకి దిగి.. నమూనాలు సేకరించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ పక్షుల్లో ఫ్లూను నిర్ధరించింది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలోని జాతీయ పార్కులు, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
'పంపించేయండి'
'ఒకే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పక్షులు మరణించాయంటే.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వాటిని అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉంది' అని పక్షి శాస్త్రవేత్త(ఆర్నిథాలజిస్ట్) డా. వేద్ ప్రకాష్ మెహ్రా ఈటీవీ భారత్‌తో చెప్పారు. వలస పక్షుల మాదిరిగా.. కాకులు ఎక్కువ దూరం ప్రయాణించవని.. అయినప్పటికీ వాటిని వేరే ప్రదేశానికి పంపించాలని సూచించారు.
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది టైప్ ఏ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల వస్తుంది. నీటిలో ఉండే పక్షులకు ఇది ఎక్కువగా సోకుతుంది. కోళ్లు, పక్షులు, ఇతర జంతువులకు కూడా ఈ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది. ఏవియన్ ఫ్లూ మనుషులకు సోకడం చాలా అరుదు. కానీ మనుషులకు వ్యాపించిన దాఖలాలు కొన్ని ఉన్నాయి.
ఇదీ చదవండి: మరో నలుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్