గన్‌తో బెదిరించి ఇంట్లో నిద్రిస్తున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు. పంచాయతీ తీర్పు ప్రకారం బాధితురాలిని పెళ్లి చేసుకుని.. రూ.5 లక్షల కట్నం, ద్విచక్రవాహనం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య గొడవ తలెత్తి వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరిన సంఘటన ఉత్తరాఖండ్ రూడ్కీ జిల్లాలోని మంగ్లౌర్ కొత్వాలీ ప్రాంతంలో వెలుగు చూసింది.
ఇదీ కథ: మంగ్లౌర్ కొత్వాలీ ప్రాంతానికి చెందిన యువతి తల్లిదండ్రులు ఏప్రిల్ 13న వైద్యం కోసం రిషికేశ్ ఎయిమ్స్‌కు వెళ్లారు. అర్ధరాత్రయినా తిరిగి రాలేదు. దీంతో తన సోదరుడు, సోదరితో కలిసి వరండాలో నిద్రపోయింది బాధితురాలు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంట్లోకి ప్రవేశించి యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. గన్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక తనపై జరిగిన అఘాయిత్యం గురించి వారికి చెప్పింది బాధితురాలు. ఆ వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు ఆమె కుటుంబ సభ్యులు. మొజ్జిజ్ కమ్యూనిటీకి చెందిన పెద్దలు పంచాయతీ నిర్వహించి.. ఇరువురికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. మే 16న వారి వివాహం జరిపించారు. మే 17న పెళ్లిని రిజిస్టర్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే యువకుడి కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు, ద్విచక్రవాహనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై బాధితురాలి బంధువులు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. నిందితుడి కుటుంబ సభ్యులు వారిపై దాడి చేశారు. ఈ దాడిలో యువతి బంధువులకు గాయాలయ్యాయి.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడి కుటుంబ సభ్యుల్లోని 8 మంది దానీశ్, రాఫా, ఇద్రీస్, పప్పూ, ఫరూక్, నాజీమ్, ప్రమోద్, అశోక్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును మహిళా ఎస్సై అన్షు చౌదరికి అప్పగించామని మంగ్లౌర్ కొత్వాలీ ఎస్ఎస్ఐ రఫత్ అలీ తెలిపారు.
నలుగురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య: బిహార్‌లోని వైశాలీ జిల్లాలో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ తల్లి.. తన నలుగురు పిల్లలతో సహా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు, తల్లి ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పాతేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుక్కీ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 'సుక్కీ గ్రామానికి చెందిన రంజిత్ సాహ్నీ భార్య తన నలుగురు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలు రింకు దేవీగా (35) చిన్నారులు 11 ఏళ్ల కరణ్ కుమార్, 8 ఏళ్ల శివానీ కుమారి, నాలుగేళ్ల సలోని కుమారిగా గుర్తించాం.' అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఇదీ చూడండి: భార్యతో గొడవ.. సిలిండర్ పేల్చుకుని భర్త మృతి.. ఇద్దరు పోలీసులకు గాయాలు
గాల్లో ఉండగా ఇంజిన్ బంద్.. 'టాటా' ఫ్లైట్‌కు తప్పిన పెనుముప్పు