రేప్ కేసులో నిందితుడైన ఓ వ్యక్తికి ఊరట లభించేలా చేసింది సామాజిక మాధ్యమం ఫేస్బుక్. లైక్, కామెంట్ అనే ఆప్షన్.. ఆయనపై నమోదైన కేసు తప్పని రుజువు చేసేందుకు ఓ ఆధారంగా మారింది. ఇది ఎలా సాధ్యపడిందంటే..
ఇదీ జరిగింది..
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఓ మహిళ మే 8న ప్రేమ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2018 జులై నుంచి వారు సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ కేసుకు సంబంధించి.. నిందితుడు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసుపై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. నిందితుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిందితుడిపై చేసిన ఆరోపణలు నమ్మశక్యంగా లేవని జస్టిస్ సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
పిటిషనర్‌కు పెళ్లైందని తెలిసే..
తొలుత.. పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది.. పిటిషనర్‌కు పెళ్లైనట్లు ఆయనపై ఆరోపణలు చేసిన మహిళకు ముందుగానే తెలుసని వాదించారు. ఇద్దరు కలిసే తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని తెలిపారు. పిటిషనర్ ఫేస్బుక్లో తన భార్యతో కలిసి దిగిన ఫొటోను ఆ మహిళ లైక్ చేసిందని పేర్కొన్నారు. దానిపై కామెంట్ కూడా చేసిన ఆధారాలను ధర్మాసనం ముందు పొందుపరిచారు.
ఈ వాదనలు విన్న ధర్మాసనం.. గతంలోను ఇలాంటి కేసులను పక్కకుపెట్టినట్లు తెలిపింది. అయితే.. పెళ్లైందని తెలిసి మరో మహిళకు వివాహం చేసుకుంటా అని మాట ఇవ్వడం తప్పుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. నిందితుడికి సెక్షన్ 376 కింద శిక్ష విధించనున్నట్లు తీర్పునిచ్చింది.