అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. తనపై నమోదైన కేసులపై యోగా గురువు రామ్‌దేవ్ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలోని పలుచోట్ల నమోదైన కేసులను స్తంభింపజేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని రామ్‌దేవ్ కోరారు. ఆ ఎఫ్ఐఆర్లు అన్నింటిని కలిపి దిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో అల్లోపతి ఔషధాల సామర్థ్యంపై రామ్ దేవ్‌బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. అల్లోపతిని తక్కువ చేస్తూ రామ్‌దేవ్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో ఆయన తీరుపట్ల భారత వైద్య సంఘం- ఐఎమ్ఏ తీవ్రస్థాయిలో మండిపడింది. దేశంలోని పలుచోట్ల ఐఎమ్ఏ శాఖలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.