Ramasahayam Surender Reddy Re Entry in Congress : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇందులో భాగంగానే అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా.. పార్టీ పటుత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ తమ కేడర్‌ను బలంగా తయారు చేసుకునే పనిలో పడింది. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న సీనియర్ నేతల సాయం కోరుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి(ఆర్‌ఎస్) పేరు అనుహ్యంగా తెరపైకి వచ్చింది. ఉమ్మడి వరంగల్‌లోని రాజకీయ నాయకులకు ఆయన పేరు సుపరిచితమే. దాదాపు 27 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
- Ponguleti about joining in Congress : 'ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి.. మరో రెండు రోజుల్లో నిర్ణయం'
RS Latest News : తాజాగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చేందుకు ఆర్‌ఎస్ తెరవెనుక కీలకంగా పని చేశారు. బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు రవి తదితర రాష్ట్ర నేతలు హైదరాబాద్‌లో పొంగులేటి ఇంటికెళ్లారు. అంతర్గతంగా జరిగిన రాజకీయ చర్చల్లో సురేందర్‌రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో.. రామసహాయం సురేందర్‌రెడ్డి తిరిగి క్రియాశీల పాత్ర పోషిస్తారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ ప్రాంత రాజకీయాలపై రానున్న రోజుల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ దురంధరుడు : రామసహాయం సురేందర్‌రెడ్డి మహబూబాద్ జిల్లా మరిపెడకు చెందినవారు. ఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, నర్సంపేట, ములుగు, పరకాల, డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఆయన అనుచరులు ఉన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, పొదెం వీరయ్య, తదితరులు ఆర్‌ఎస్ శిష్యులే.
రామసహాయం సురేందర్‌రెడ్డి.. తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌తో.. సాన్నిహిత్యంగా ఉండేవారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనక పోయినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్ తెలంగాణ ఫోరం ఏర్పాటులో సురేందర్‌రెడ్డి కీలకంగా ఉన్నారు. హస్తం పార్టీలోనే ఉంటూ తెలంగాణ కోసం పనిచేశారు.
కలిసి రాని వారసత్వం: 30 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లా రాజకీయాలు రామసహాయం సురేందర్‌రెడ్డి చుట్టూ తిరిగేవి. కాంగ్రెస్‌లో ఎదురు ఉండేది కాదు. 1996లో వరంగల్ ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆర్ఎస్.. తన వారసులను జిల్లాకు పరిచయం చేసేందుకు కాలం కలిసి రాలేదు. ఆయన కుమారుడు రఘురాంరెడ్డి. ఇద్దరు మనువళ్లు అర్జున్‌రెడ్డి, వినాయక్‌రెడ్డి, ఉన్నారు.
ఈ క్రమంలోనే కుమారుడు లేదా మనువడిని ఎమ్మెల్యేగా బరిలోకి దించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. పాలకుర్తి లేదా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దింపాలని చూస్తున్నట్లుగా సమాచారం. అంగ బలంతోపాటు ఆర్థిక బలం ఉండటంతో జిల్లా రాజకీయాల్లో రీ ఎంట్రీకి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: