అయోధ్య రామమందిరం(ayodhya ram mandir) నిర్మాణ పనులు జోరందుకున్నాయని తెలిపారు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. కొంత భాగం(పునాదికి సంబంధించిన) పనులు ఈ అక్టోబర్‌లోగా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిపుణుల సలహా మేరకు.. రోలర్- కాంపాక్టెడ్ కాంక్రీట్ అనే కొత్త టెక్నాలజీతో పునాది పనులు చేపడుతున్నట్లు వివరించారు.
ఎలాంటి విపత్తునైనా తట్టుకునేలా, దృఢంగా ఉండేలా నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేశారు. మొత్తం 40-50 పొరలను(లేయర్లు) ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 లేయర్లు వేసినట్లు చెప్పారు.
''ఆలయ నిర్మాణ పనులు రోజూ 24 గంటల్లో 12 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో జరుగుతున్నాయి. 1.2 లక్షల చదరపు మీటర్ల గొయ్యి తవ్వారు. ప్రతి పొరను రోలర్‌తో చదును చేసి.. పైన మరో పొర వేస్తారు. అలా మొత్తం 40-50 లేయర్లు ఉంటాయి. ఈ పనులు అక్టోబర్‌లోగా పూర్తవుతాయి. రాముని దయవల్ల అందరు ఇంజినీర్లు, కార్మికులు ఆరోగ్యంగా ఉన్నారు.''
- చంపత్ రాయ్, ట్రస్టు ప్రధాన కార్యదర్శి
రామాలయ(Ram Temple) నిర్మాణ పనులు.. ట్రస్టు ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. రామ మందిరం నిర్మాణం పూర్తయ్యేందుకు.. మూడేళ్లు పడుతుందని కొద్దిరోజుల కిందట చెప్పారు రాయ్.
రామాలయాన్ని(Ram Temple) సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ పార్కోటా అనే రాతి గోడను నిర్మిస్తారు. భారీ వరదలను తట్టుకునే విధంగా భూమి లోపల నుంచి ఈ గోడలను నిర్మించనున్నారు.
ఇవీ చూడండి: అయోధ్య గుడి తవ్వకాల్లో సీతా దేవి వస్తువులు!