రాజ్యసభలో ప్రాంతీయ భాషల వినియోగం గణనీయంగా పెరిగింది. రాజ్యసభలో చర్చలు, ఇతర కార్యక్రమాలు హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఎక్కువగా కొనసాగుతాయి. సభ్యులు ముందస్తు అనుమతితో రాజ్యాంగంలోని 22 షెడ్యూల్‌లోని 22 భాషల్లో ఏ భాషలోనైనా మాట్లాడే అవకాశముంది.
ప్రోత్సాహంతో..
1952లో రాజ్యసభ ఏర్పడిన అనంతరం 22వ షెడ్యూల్‌లోని భాషల్లో (హిందీ మినహా) మిగతా భాషల్లో సభ్యులు మాట్లాడిన, చర్చల్లో పాలుపంచుకున్న సందర్భాలు తక్కువే. రాజ్యసభ ఛైర్మన్ ప్రోత్సాహంతో గత సమావేశాల కాలంలో తొలిసారిగా సభలో డోగ్రీ, కశ్మీరి, కొంకణి, సంతాళి భాషల్లో సభ్యులు మాట్లాడారు. సుదీర్ఘ విరామం తర్వాత బొడో, గుజరాతీ, మైథిలీ, మణిపురి, నేపాలీ భాషలు సభలో వినిపించాయి.
అయిదు రెట్లు..
2004 నుంచి 2017 సంవత్సరాల కాలంతో పోల్చితే 2018 నుంచి 2020 వరకు ప్రాంతీయ భాషల వినియోగం ఏకంగా అయిదు రెట్లు పెరిగింది. రాజ్యసభ ఛైర్మన్ చొరవతో 2018లో తొలిసారి సింధీ భాషలోనూ ఓ సభ్యుడు మాట్లాడారు. 2013 నుంచి 2020 వరకు తమిళం, తెలుగు, ఉర్దూ, బెంగాలీ భాషల్లో చర్చల్లో పాల్గొన్నారు. ఈ నాలుగు భాషల తర్వాత అయిదో స్థానంలో సంస్కృతం నిలిచింది.
ఇదీ చదవండి: 'పీఎం కేర్స్'పై మోదీకి మాజీ అధికారుల లేఖ