రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ఆవాజ్ మొహమ్మద్.. వేల ఏళ్ల నాటి సంప్రదాయ కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. బీఏ చదివినా.. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఉపాధి మార్గాన్నే ఎంచుకున్నాడు. అదే లక్కపని. తండ్రి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి, విలాసవంతమైన జీవితాన్నిచ్చినా.. తాను మాత్రం వారసత్వంగా వచ్చిన లక్కపనినే జీవనాధారంగా మార్చుకున్నాడు.
"లక్కపై మేం చేస్తున్న పని, ఏడు తరాలుగా చేస్తున్నాం. మా తాతమముత్తాతల కాలం నుంచీ ఇదే పని చేసుకుంటూ వస్తున్నాం. మేం 9వ తరం వాళ్లం."
- ఆవాజ్ మొహమ్మద్, కళాకారుడు
ప్రపంచ గుర్తింపు..
ఆవాజ్.. తన తాతముత్తాతల వృత్తి అంతరించిపోకుండా కాపాడాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి.. లక్కతో వినూత్న ఉత్పత్తులు తయారుచేయడంపై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం రాజస్థాన్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా లక్క ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టగలిగాడు ఆవాజ్ మొహమ్మద్.
"మొదట్లో లక్కను మణిహార్ గాజుల తయారీకి మాత్రమే వాడేవాళ్లం. ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో తయారుచేసేవాళ్లం. అవి ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయాయి. నేను పదో తరగతి చదివిన తర్వాత ఐటీఐ కోర్సు పూర్తిచేశాను. ఆ తర్వాత మాన నాన్న ఉద్యోగం మానేసి ఈ పనిలో చేరమని సలహా ఇచ్చారు. అప్పట్లో మణిహార్ గాజులు దేశవిదేశాలకు ఎగుమతి అయ్యేవి. మా నాన్న ప్రభుత్వోద్యోగం మానేయమన్నారు. లక్క పనిలో కొత్తకొత్త డిజైన్లు చేయమని సలహా ఇచ్చారు."
- ఆవాజ్ మొహమ్మద్, కళాకారుడు
ఆవాజ్ కుటుంబం గత 7 తరాల నుంచీ ఇదే పని చేస్తోంది. లక్కతో నగలు సహా.. ఇతర ఉత్పత్తులు రూపొందించి, విక్రయిస్తున్నాడు ఆవాజ్. ఆ కుటుంబానికి చెందిన 9వ తరం కూడా లక్కపనిలోనే నిమగ్నమైంది.
"క్రీ.పూ. 4వేల సంవత్సరం నాటి పని ఇది. హరప్పా, మొహంజొదారో కాలంలోనూ లక్కను వినియోగించారు. బంగారు కడియాల్లో లక్క నింపేవారు. దాన్ని బట్టి చూస్తే లక్క పని చాలా పురాతనమైనదని అర్థమవుతుంది."
- ఆవాజ్ మొహమ్మద్, కళాకారుడు
రాష్ట్రపతి పురస్కారం..
ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పనే అయినా.. ఏదైనా వినూత్నంగా చేయాలన్న ఉద్దేశంతో మొదట లక్కతో గుండీలు తయారుచేశాడు ఆవాజ్. ఆ గుండీలు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా అమ్ముడయ్యాయి. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడలేదీ కళాకారుడు. వెయ్యికి పైగా కళాకృతులకు లక్కతో ప్రాణం పోశాడు. రాష్ట్రపతి పురస్కారం అందుకున్నాడు.
"లక్కతో చేసే ఈ పని, రాజస్థాన్ మహిళలకు చాలా ఇష్టం. ఈ పని చేసేవాళ్లను చాలా గౌరవంతో చూస్తారు. ఇప్పటికీ వివాహాల్లో లక్కగాజులే ధరిస్తారు. చిన్నారులు కూడా లక్కగాజులే వేసుకుంటారు. చనిపోయిన మహిళల చేతులకూ లక్కగాజులు తొడుగుతారు ఇక్కడ."
- ఆవాజ్ మొహమ్మద్, కళాకారుడు
దేశ విదేశాల్లో ప్రదర్శన..
ప్రస్తుతం లక్క ఉత్పత్తుల తయారీ గతంలో లాగా విస్తృతంగా జరగడం లేదు. ఈ కళ అంతరించిపోకుండా ఉండేందుకు ఆవాజ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం దేశ విదేశాల్లో తన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతూ, వాటిపై ప్రచారం చేస్తున్నాడు.
ఔత్సాహికులకూ శిక్షణ..
ఆవాజ్ నలుగురు కుమార్తెలు కూడా లక్క ఉత్పత్తుల తయారీలో తండ్రికి సహకారం అందిస్తారు. ఆ అక్కాచెల్లెళ్లు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఔత్సాహిక పేద మహిళలకు ఈ కళలో శిక్షణనిస్తున్నారు.
"ప్రస్తుతం.. నేను శిక్షణ తీసుకుంటున్నాను. మా అక్క కూడా నాన్నదగ్గరే పనిచేస్తోంది. నేనూ ఆమెతో కలిసి పని నేర్చుకుంటున్నా."
- తపసూ సుల్తానా, ఆవాజ్ కుమార్తె
"లక్కపని ఎలా చేయాలో మహిళలకు నేర్పిస్తాను. ఖస్‌తౌర్ నుంచి ఆదివాసీ మహిళలు పని నేర్చుకునేందుకు వస్తారు. స్కూల్, కాలేజీ విద్యార్థులు.. పేద మహిళలకు పని నేర్పిస్తాను. వాళ్లు ఈ పని చేసుకుని, ఇంటిని స్వయంగా నడపాలన్నదే నా ఉద్దేశం."
- అన్వర్ జహా, ఆవాజ్ భార్య
ఇప్పటివరకు అమెరికా, లండన్, స్వీడన్, డెన్మార్క్ దేశాల్లో 25కు పైగా ప్రదర్శనల్లో పాల్గొన్నాడు ఆవాజ్. లక్క కళ అంతరించిపోకుండా కాపాడుతున్న ఆవాజ్‌కు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందితే.. మరిన్ని తరాలకు ఈ కళ చేరవేసినట్లవుతుంది.
ఇదీ చదవండి: క్యాన్సర్ చిన్నారులకు అండగా జుట్టు సేకరిస్తూ..