ఎలాగైనా రైల్వేలో ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్న ఓ యువకుడు కొత్త మోసానికి తెరలేపాడు. నియామక పరీక్షను తనకు బదులు తన స్నేహితుడితో రాయించాలనుకున్నాడు. అందులో భాగంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో అధికారుల కన్నుగప్పడానికి వేలి ముద్రనే మార్చేయాలనుకున్నాడు. వేడి పెనం, బ్లేడు సాయంతో తన బొటనవేలి చర్మాన్ని తొలగించి స్నేహితుడి బొటన వేలుకు అతికించాడు. అయితే బయోమెట్రిక్ యంత్రంలో వేలి ముద్ర వేయడానికి యత్నిస్తుండగా ఆ చర్మం ఊడిపోవడం వల్ల వారి బండారం బయటపడింది.
ఈ నెల 22న గుజరాత్‌లోని వడోదరలో రైల్వే నియామక పరీక్షను నిర్వహించారు. బిహార్ ముంగెర్ జిల్లాకు చెందిన మనీశ్ కుమార్ తన స్థానంలో పరీక్ష రాయడానికి స్నేహితుడు రాజ్యగురు గుప్తాను ఒప్పించాడు. పథకంలో భాగంగా మనీశ్ వేడి పెనంపై తన బొటనవేలిని పెట్టడంతో పొక్కు లేచింది. ఆ తర్వాత వేలి చర్మాన్ని బ్లేడుతో తొలగించి రాజ్యగురు బొటనవేలిపై అతికించాడు.
పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ యంత్రంలో రాజ్యగురు ఎన్నిసార్లు వేలిముద్ర వేసినా అది మనీశ్ వివరాలతో సరిపోలలేదు. దీంతో నిర్వాహకులకు అనుమానం వచ్చింది. అదే సమయంలో అతడు తన బొటనవేలిని ప్యాంటు జేబులో దాచుకోవడం వారి కంటపడింది. దీంతో రాజ్యగురు బొటనవేలిపై శానిటైజర్ స్ప్రే చేయడంతో అతికించిన చర్మం ఊడికింద పడింది. ఈ అనూహ్య ఘటనతో అధికారులు కంగుతిన్నారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బుధవారం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: బయట లాగిస్తున్నారా వాడిన నూనెనే మళ్లీ మళ్లీ, బీ అలర్ట్