RAILWAY SENIOR CITIZEN CONCESSION: సీనియర్ సిటిజన్లకు టికెట్లపై రాయితీని పునరుద్ధరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వయోవృద్ధులకు రైల్వే టికెట్లపై రాయితీని పునరుద్ధరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొన్ని మార్పులతో దీన్ని తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. ఇప్పటివరకు 58ఏళ్లు పైబడిన మహిళలు, 60ఏళ్లు దాటిన పురుషులకు రాయితీ వర్తిస్తుండగా.. ఇకపై దీన్ని 70ఏళ్లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు నాన్-ఏసీ ప్రయాణికులకు మాత్రమే రాయితీని పునరుద్ధరించాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
'స్లీపర్, జనరల్ తరగతుల్లో ప్రయాణించే వయోవృద్ధులకే రాయితీని పరిమితం చేయడం వెనక ఓ లాజిక్ ఉంది. రాయితీకి అర్హులైన ప్రయాణికుల్లో 70 శాతం మంది ఈ తరగతుల్లోనే వెళ్తుంటారు. అయితే, ఇవన్నీ ప్రతిపాదనలు మాత్రమే. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు' అని రైల్వే అధికారులు వివరించారు. రాయితీలకు అయ్యే వ్యయాన్ని భర్తీ చేసుకునే ఆలోచనతో నూతన సబ్సిడీ నియమాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ రాయితీలు వృద్ధులకు ఉపయోగపడతాయని వీటిని పూర్తిగా రద్దు చేస్తామని తాము ఎన్నడూ చెప్పలేదని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు, అన్ని రైళ్లలో ప్రీమియం తత్కాల్ స్కీమ్‌ను తీసుకొచ్చేందుకు రైల్వే కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధానం వల్ల ఆదాయం పెరుగుతుందని.. రైల్వేపై పడే రాయితీల భారాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం సుమారు 80 రైళ్లలో ప్రీమియం తత్కాల్ విధానం అమలులో ఉందని వివరించారు. చివరి నిమిషంలో కాస్త అధిక ధరకు టికెట్ బుక్ చేసుకునే విధానాన్నే ప్రీమియం తత్కాల్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రీమియం తత్కాల్ కోసం కొన్ని సీట్లను రిజర్వు చేస్తున్నారు.
రాయితీలు ఉంచాలా? వద్దా?
రైల్వే శాఖ 50 రకాల రాయితీలను అందిస్తోంది. వీటి వల్ల రైల్వేపై రూ.2వేల కోట్ల మేర భారం పడుతోంది. ఇందులో 80శాతం వరకు వయోవృద్ధుల రాయితీలే ఉంటున్నాయి. రాయితీలను ఉపసంహరించుకోవాలని పలు కమిటీలు రైల్వే శాఖకు సిఫార్సులు చేశాయి.
ఇదీ చదవండి: