సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు రైల్రోకోకి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారతీయ రైల్వేకు చెందిన 'రైల్వే ప్రోటెక్షన్ స్పెషల్ ఫోర్సు'ను రంగంలోకి దించనుంది. ఈ మేరకు 20 కంపెనీల అదనపు బలగాలను దేశవ్యాప్తంగా మోహరించేందుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్న కారణంగా ఆ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
వ్యవసాయ చట్టాలను రద్దు చేసే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) దేశవ్యాప్తంగా రైల్‌రోకోకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు రైళ్ల దిగ్బంధం కొనసాగుతుందని తెలిపింది.
"శాంతిభద్రతలను కాపాడాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సంబంధిత జిల్లా అధికార యంత్రాంగంతో పర్యవేక్షిస్తున్నాం. ఇందుకుగాను స్థానికంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం సేకరించాం. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇందుకుగానూ సుమారు 20 వేల మందిని రంగంలోకి దించాం."
-అరుణ్ కుమార్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్
రైలు ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటమే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు అరుణ్ కుమార్. రైలు రోకో చేపట్టే ఆ నాలుగు గంటల వ్యవధిలో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు