దేశంలో నిధుల సమీకరణ కోసం జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్ఎంపీ)ను ప్రవేశపెట్టిన కేంద్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. 70ఏళ్లుగా కూడబెట్టుకుంటున్న ఆస్తులను ఎలా అమ్మేస్తారని ప్రశ్నించారు.
"70ఏళ్లుగా దేశంలో ఏలాంటి అభివృద్ధి జరగలేదని మోదీ ప్రభుత్వం ఆరోపిస్తూనే.. ఇప్పటివరకు కూడబెట్టుకున్న ఆస్తులను అమ్మేస్తోంది. అసంఘటిత రంగాన్ని అంతం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. సంఘటిత రంగంలో గుత్తాధిపత్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా చేస్తే ఎక్కడా ఉద్యోగాలు ఉండవు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 లక్షల కోట్ల రూపాయల ఎన్ఎంపీని సోమవారం ప్రకటించారు. ఈ కార్యక్రమం కింద విద్యుత్ రంగం నుంచి రోడ్లు, రైల్వే శాఖ వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను అభివృద్ధి చేసి నిధుల సమీకరించనున్నట్లు మంత్రి తెలిపారు.
రాహుల్ గాంధీతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న మరో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం.. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. నిధుల సేకరణ పేరుతో ఆస్తులను అమ్మకూడదన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత వాటాదారులు, ఉద్యోగులు, యూనియన్లు, రైతులను సంప్రదించాలని అభిప్రాయపడ్డారు.
'కాంగ్రెస్‌కే ఎలాంటి విలువ లేదు...'
కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు భాజపా నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. కాంగ్రెస్.. నిరర్థక ఆస్తితో సమానం అని.. ఆ పార్టీకి అసలు ఎలాంటి విలువ లేదని ఎద్దేవా చేశారు. దేశ ప్రగతి కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం దేశాన్ని నాశనం చేసేందుకే ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి:- 2022 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ సమాయత్తం!