కరోనా ఆంక్షలతో మరోసారి సొంతూళ్లకు వలస కార్మికులు పయనమైన వేళ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ప్రస్తుత క్లిష్ట సమయంలో వారికి ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుదేనని స్పష్టంచేశారు.
"వలస కూలీలు మరోసారి తరలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కానీ, కరోనా వ్యాప్తికి ప్రజలను నిందించే ప్రభుత్వం.. ఇలాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమం చేపట్టగలదా?"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
పేదలు, కూలీలు, వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు.
"కరోనా సృష్టిస్తున్న బీభత్సానికి లాక్డౌన్ లాంటి కఠిన చర్యలను ప్రభుత్వం తీసుకోవడాన్ని అర్థం చేసుకోగలం. కానీ, వలస కార్మికులను ప్రభుత్వం మరోసారి వదిలేసింది. ఇది మీ వ్యూహమా? అందరి భద్రతకు భరోసా ఇచ్చే విధంగా విధానాలుండాలి. పేదలు, కూలీలు, వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం చేయండి."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి
ట్వీట్‌తో పాటే దిల్లీలోని ఆనంద్ విహార్ బస్ టర్మినల్లో స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్సుల కోసం ఎదురుచూస్తున్న వందలాది కూలీల ఫొటోను జతచేశారు ప్రియాంక.
ఆంక్షలతోనూ అవస్థలు..
రెండో దశ ఉద్ధృతితో దిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో 6 రోజుల లాక్డౌన్ విధించింది అక్కడి సర్కారు. ఈ నేపథ్యంలోనే సొంతూళ్లకు వెళ్లేందుకు వందలాది కూలీలు ప్రయాణమయ్యారు. దీంతో బస్స్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. వైరస్ కట్టడికి మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ లాంటి కఠిన ఆంక్షలను అమలుచేస్తున్నారు.
ఇదీ చూడండి: లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వలస కార్మికులు పయనం