Fuel Price Hike: సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. వంట గ్యాస్ ధరను కూడా రూ.50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం విధించిన లాక్డౌన్ ముగిసిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
"దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం విధించిన లాక్డౌన్ ముగిసింది. ఇకపై కేంద్రం తరచూ వీటి ధరలను పెంచుతూ ఉంటుంది. ఈ విషయపై ప్రధాన మంత్రిని ప్రశ్నిస్తే చప్పట్లు కొట్టండి అంటారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
"ఇంధన ధరలను పేదలకు భారంగా మార్చిన కేంద్రం.. రూ.10వేల కోట్లు లాభపడింది. చాలా మంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ధరలు పెరిగాయని అంటున్నారు. కానీ పెట్రోలియం శాఖ మంత్రి మాత్రం అసలు ముడి చమురును భారత్ రష్యా నుంచి కొనుగోలు చేయదని చెప్తున్నారు."
-మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత
"అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని మేము ఇదివరకే చెప్పాము. మా అంచనా నిజమైంది. కాంగ్రెస్ సామాన్యుడికి అండగా నిలుస్తుంది" అని మరో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్‌రంజన్ చౌదరి పేర్కొన్నారు.
"ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన సందర్భంగా ప్రజలకు ఇది కేంద్రం ఇచ్చిన మరో ద్రవ్యోల్బణం కానుక. లఖ్‌నవూలో ఎల్పీజీ సిలిండర్ దాదాపు రూ.1000 ఉంది. పట్నాలో రూ.వెయ్యిపైనే ఉంది. ఎన్నికలు ముగిశాయి, ద్రవ్యోల్బణం మొదలైంది."
-అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
"భాజపాను గెలిపిస్తే ఇదే పరిస్థితి నెలకొంటుందని అఖిలేశ్ ఎన్నికల ప్రచారంలోనే ప్రజలను హెచ్చరించారు. భాజపా అధికారంలో ఉంటే ఇది చేస్తుంది."
-జయా బచ్చన్, ఎస్పీ ఎంపీ
రెండుసార్లు వాయిదా..
ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాల నిరసనల మధ్య రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది.
రికార్డ్ మిస్..
2019లో నిర్విరామంగా సభలు జరిగినట్టు రాజ్యసభకు రికార్డు ఉంది. 13 రోజుల పాటు ఎలాంటి వాయిదాలు లేకుండా సభలు జరిగాయి. ఈసారి కూడా 12 రోజుల పాటు నిర్విరామంగా సభలు సాగిన నేపథ్యంలో రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం వచ్చినా.. మంగళవారం సభ వాయిదాతో ఆ రికార్డ్ మిస్ అయింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఐదు నెలల పాటు ధరలను కేంద్రం కట్టడి చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే తాజాగా గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై భారీగా ధరలను పెంచేందుకు చమురు సంస్థలకు అనుమతించింది. దీంతో పెట్రోల్, డీజిల్ లీటరుకు 80 పైసలు, 14 కిలోల గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో సిలిండర్ ధర రూ.949.50, పెట్రోల్ రూ. 96.21, డీజిల్ రూ.87.47గా ఉంది.
ఇదీ చూడండి : జయలలిత మృతిపై విచారణ.. కమిషన్ ఎదుట హాజరైన ఓపీఎస్