Punjab polls: పంజాబ్ రాజకీయాల్లో డేరాలది ప్రత్యేక స్థానం. వాటి మద్దతు దక్కించుకోగలిగితే ఎన్నికల్లో సులభంగా విజయం సాధించొచ్చన్నది రాజకీయ పార్టీల విశ్వాసం. అందుకే ఎన్నికలొచ్చిన ప్రతిసారీ డేరాల సందర్శనకు నాయకులు బారులు తీరుతుంటారు. వాటి అధిపతుల ఆశీస్సులు పొందేందుకు, వారి అనుచరులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
పీడిత ప్రజలకు అండగా..
‘డేరా’ అంటే శిబిరం/మఠం అని అర్థం. పర్షియన్ భాషలోని ‘డేరాహ్’ అనే పదం నుంచి అది వచ్చింది. నైతిక, ఆధ్యాత్మిక విలువలతో కూడిన వ్యక్తులు నివసించే ప్రాంతాలుగా డేరాలను పరిగణిస్తుంటారు. కులమతాలు, ఆర్థిక, సాంస్కృతిక అంశాల ప్రాతిపదికన అణచివేతకు గురయ్యే ప్రజలకు అండగా నిలబడేందుకుగాను డేరాలు ఆవిర్భవించాయి. ప్రధానంగా కుల వివక్షను ఇవి తీవ్రంగా వ్యతిరేకించేవి. ఫలితంగా సమాజంలో అణగారినవర్గాలకు చెందిన అనేకులు వీటికి అనుచరులుగా మారారు. మగ శిశువు పుట్టేలా ఆశీర్వదించాలని, తమ కుటుంబసభ్యులు మత్తుపదార్థాల వ్యసనం నుంచి బయటపడేలా చేయాలని, విదేశాలకు వలస వెళ్లి స్థిరపడేలా ఆశీస్సులు అందజేయాలని.. ఇలా రకరకాల విజ్ఞప్తులతో డేరాల అధిపతులను ఆశ్రయించేవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువయింది.
Punjab Assembly Polls
వారి మాట శాసనం
కాలక్రమంలో రాష్ట్రంలో డేరాలు ప్రబల శక్తులుగా ఎదిగాయి. సంక్షేమ కార్యక్రమాలకు అవి శ్రీకారం చుట్టాయి. అనేక ఆస్పత్రులు, పాఠశాలలు, సాంకేతిక శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాలను స్థాపించాయి. డ్రగ్స్‌కు బానిసగా మారినవారి కోసం పునరావాస కేంద్రాలను నడిపిస్తున్నాయి. కొన్నయితే స్థానికంగా ప్రత్యేక రవాణా వ్యవస్థను కూడా కలిగి ఉన్నాయి. ఆయా డేరాలకు విలక్షణ సంప్రదాయాలు, నినాదాలు, కీర్తనలు ఉంటాయి. డేరాల అధిపతుల ఆదేశాలను అనుచరులు శిరసావహిస్తుంటారు.
Punjab Deras
రకరకాల డేరాలు
పంజాబ్‌లో వివిధ రకాల డేరాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి రవిదాసియా డేరాలు. ఈ రవిదాసియా డేరాల్లో సచ్ ఖండ్ బల్లాన్ అత్యంత కీలకమైనది. సిక్కు డేరాల్లో బండేయి ఖల్సా, నానక్‌పాంథీస్, సేవాపాంథీస్ వంటివి ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. రాధాస్వామి సత్సంగ్, నిరంకారీ, నామ్‌ధారీ, దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ వంటివి కూడా రాష్ట్రంలో బాగా పేరున్న డేరాలు.
రామ్ రహీమ్ విడుదలతో..
పంజాబ్ జనాభాలో మూడొంతుల మందికిపైగా దళితులే. వారు వివిధ రకాల డేరాలను అనుసరిస్తున్నారు. బలమైన రవిదాసియాల డేరాలు ఈ దఫా కాంగ్రెస్‌కు అండగా నిలుస్తాయని విశ్లేషణలొస్తున్నాయి. హత్య, అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛ సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ హరియాణాలోని రోహ్‌తక్ జైలు నుంచి గతవారం పెరోల్ మీద విడుదలవడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. రామ్ రహీమ్‌కు, ఆయన డేరాకు పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో దళితుల మద్దతు ఎక్కువ. ఆయన విడుదల భాజపాకు కలిసొస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు- శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ కూటమికి గుర్మంత్ సిద్ధాంత్ ప్రచారక్ సంత్ సమాజ్ ఇప్పటికే మద్దతు ప్రకటించడం గమనార్హం. ఏ పార్టీకి ఓటెయ్యాలన్నదానిపై.. పోలింగ్ తేదీ సమీపించాక మరిన్ని డేరాలూ తమ అనుచరులకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి.
రాజకీయ ప్రాధాన్యం
పంజాబ్‌లో దాదాపు 13 వేల గ్రామాలుండగా.. వాటిలో 9 వేలకు పైగా ఊర్లలో డేరాలు ఉన్నాయి. దీన్నిబట్టి వాటి ప్రాబల్యాన్ని అర్థం చేసుకోవచ్చు. గణనీయ సంఖ్యలో అనుచరులను కలిగి ఉండటంతో రాజకీయాల్లో వీటికి ప్రాధాన్యం పెరిగింది. ప్రధానంగా ఎన్నికల వేళ అన్ని పార్టీల నాయకులు డేరాలను క్రమంతప్పకుండా సందర్శిస్తుంటారు. ప్రస్తుతం జలంధర్ జిల్లా బల్లాన్ గ్రామ శివార్లలోని ప్రఖ్యాత డేరా సచ్ ఖండ్ బల్లాన్‌కు రాజకీయ నాయకుల తాకిడి ఎక్కువైంది. సీఎం చరణ్‌జీత్‌సింగ్ చన్నీ (కాంగ్రెస్) సహా పలు పార్టీల నేతలు దాన్ని సందర్శించారు. చన్నీ ఓ రాత్రి అక్కడ బస చేశారు కూడా. పంజాబ్‌లో గణనీయ సంఖ్యలో ఉన్న రవిదాసియా దళితులు ఈ డేరా అధిపతి ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తారనే పేరుంది. డేరాల ప్రాధాన్యం తెలుసు కాబట్టే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాధాస్వామి సత్సంబ్ బియాస్ అధిపతి గురిందర్‌సింగ్ ధిల్లాన్‌ను కలిశారు.
ఇదీ చదవండి: గోవులపై కమలం ప్రేమ.. యూపీ ఎన్నికల్లో కలిసొచ్చేనా?