Punjab Assembly Election postpone: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహించింది. గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీ మార్చాలని కాంగ్రెస్, భాజపా, అకాలీదళ్ తదితర పార్టీలు కోరినందున.. దీనిపై చర్చించనుంది. అనంతరం ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Punjab Guru Ravidas Jayanti
ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి ఉంది. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ జనవరి 13న ఈసీకి లేఖ రాశారు. బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఆ వర్గానికి చెందినవారు దాదాపు 32శాతంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారు.
అటు... భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి.
ఇదీ చదవండి: భాజపా x కాంగ్రెస్: మణిపుర్ ఎన్నికల్లో పైచేయి ఎవరిదో?